రాష్ట్రంలో కరోనా మహమ్మరి విస్తరించకుండా ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఈ నెల 31 వరకు రాష్ట్రమంతటా లాక్‌డౌన్ అమలుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీచేశారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఈ నెల 31 వరకు ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ప్రజారవాణా వ్యవస్థను తక్షణమే నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఆటోలు, ట్యాక్సీలు సైతం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆస్పత్రులు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్‌లకు రాకపోకలు సాగించేందుకు పరిమితంగా వాహనాలకు మినహాయింపునిచ్చారు. రాష్ట్రాల మధ్య ప్రజా, ప్రవేటు రవాణాను నిలిపివేస్తూ ఆదేశాలిచ్చారు.
నిత్యావసరం కాని దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థలు ఈ నెలాఖరు వరకు మూసివేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, గోదాములు వంటివి అవసరమైతే.. పరిమిత సిబ్బందితో పనిచేయాలని సూచించారు. మందిరాలు, మసీదులు, చర్చిల్లోనూ 31వ తేదీ వరకు దర్శనాలు, ప్రార్థనలు నిలిపివేయాలని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ వంద పడకల ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ల ఏర్పాటుకు ఆదేశించారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ 200 నుంచి 300 పడకల అత్యాధునిక సౌకర్యాలతో వార్డులు ఏర్పాటుచేయాలని స్పష్టం చేశారు. ప్రజలు కొన్ని రోజుల పాటు ఇళ్లలోనే ఉండటం ద్వారానే కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పది మంది కంటే ఎక్కువ గుమికూడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వస్తున్న వ్యక్తులు తప్పనిసరిగా 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని ఆదేశించారు.
నిత్యావసరాలు, కూరగాయలు, పెట్రోల్ బంకులు, గ్యాస్, మందులు వంటి అత్యవసర సేవలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపునిచ్చారు. వీటిని అధిక ధరలకు విక్రయించకూండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. దీని కోసం ధరల పట్టికను విడుదల చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. జిల్లా కలెక్టర్లు, జేసీలు,ఆర్డీవోలు,ఎమ్మార్వోలు, వైద్యఆరోగ్య సిబ్బంది, పోలీసులు, విద్యుత్ శాఖ, మున్సిపల్ సిబ్బంది, బ్యాంకులు, ఏటీఎంలు, ఫార్మసీ దుకాణాలు, మీడియా సిబ్బందికి లాక్‌డౌన్ నుంచి మినహాయింపునిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థల్లో అత్యవసర విధులు నిర్వహించేవారు మాత్రమే హాజరవ్వాలని సూచించారు. తప్పనిసరిగా ఉత్పత్తి కొనసాగించాల్సిన పరిశ్రమలు.. ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టంచేశారు. వ్యవసాయ పనులపై ఉన్న రైతులు, కూలీలకు మినహాయింపునిచ్చారు.