లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో పట్టణ, నగర ప్రాంతాల్లో దుకాణాలు, సంస్థలు తెరుచుకునేందుకు పురపాలక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. 31వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగిస్తూనే.. నిబంధనలు పాటిస్తూ దుకాణాలు తెరుచుకునేందుకు మినహాయింపులు ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లా యంత్రాంగం కంటైన్మెంట్, బఫర్ జోన్లలో తీవ్రత తగ్గిందని... డీనోటిఫై చేసే వరకు ఆ ప్రాంతాల్లో దుకాణాలు తెరవకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు దుకాణాలు తెరుచుకోవచ్చని తాజా ఆదేశాల్లో తెలిపింది.
కాలనీలు, రెసిడెన్షియల్ భవనాల్లో ఉన్న దుకాణాలు తీయోచ్చని పురపాలక శాఖ వెల్లడించింది. సినిమా హాళ్లు, మాల్స్, జిమ్‌లు, పార్కులు, వినోద ప్రాంతాలకు అనుమతి లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రేక్షకులు లేకుండా క్రీడా మైదానాలు తెరవొచ్చని స్పష్టం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్, ఇతర హాస్పిటాలిటీ సేవలకు అనుమతి లేదని పేర్కొన్న ప్రభుత్వం.. వైద్య సిబ్బంది, పోలీసు, అత్యవసర సేవలు, క్వారంటైన్ సేవలు అందిస్తున్న హోటళ్లకు, టేక్ అవే కిచెన్లకు మినహాయింపులిచ్చింది.