రాష్ట్రంలో 97వేల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలున్నాయి. దాదాపు 12లక్షల మంది కార్మికులు ఈ రంగంపై ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఆధారపడి ఉన్నారు. లాక్‌డౌన్ ప్రభావం కారణంగా దాదాపు 2నెలల పాటు ఈ పరిశ్రమలన్నీ మూతపడటంతో తయారీరంగంపై తీవ్ర ప్రభావం పడింది. నష్టం అంచనాను ఇప్పుడే వేయటం కష్టతరమైనా వేలాది కోట్లల్లో ఈ తీవ్రత ఉంటుందని పారిశ్రామికవేత్తలు కలవరపడుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొంతమేర ఉద్దీపనులు ప్రకటించినా అవి ఏమాత్రం చాలవనే అభిప్రాయం చిన్న పరిశ్రమల యజమానుల్లో వ్యక్తమవుతోంది.
యూనిట్లలో ఉత్పత్తి లేకున్నా వేతనాల చెల్లింపులు ఎంఎస్ఎంఈలకు తలకు మించిన భారమైంది. వీటిలో ప్రధానంగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, బియ్యం, పప్పు, నూనె మిల్లులు, ప్లాస్టిక్, ఫ్యాబ్రికేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, జిన్నింగ్, స్పిన్నింగ్, ఇతర ఆహార అనుబంధ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలున్నాయి. లాక్‌డౌన్ అనంతరం సడలింపు వచ్చినా...., పనిచేసే వారు లేకపోవటం, ప్రజా రవాణా నిలిచిపోవటం, రెడ్ జోన్ పరిధి వంటి అంశాల కారణంగా ఉత్పత్తి పునరుద్ధరణ కష్టతరంగా మారింది.రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలు మూతపడటంతో లక్షకోట్ల వరకూ ఉత్పత్తులు నిలిచిపోయాయి.
కరోనా కాటుకు ముందే గత 7-8నెలలుగా ఆర్థికమాంద్యం ఇబ్బందులతో సతమతమవుతున్న పారిశ్రామిక రంగం తాజా పరిస్థితులతో పూర్తిగా కుదేలయ్యే ప్రమాదంలో పడింది. ప్రభుత్వం నుంచి పరిశ్రమలకు రావాల్సిన దాదాపు 4వేల కోట్ల ప్రోత్సహకాలు విడుదల కాకుండా పెండింగ్లో ఉండటం..., పలు పరిశ్రమలు ఓవర్ డ్రాఫ్ట్ ఇతరత్రా ఇబ్బందుల్లోకి వెళ్లటం వంటి పరిణామాలకు కరోనా కష్టాలు తోడయ్యాయి. ప్రభుత్వాలు 10శాతం అప్పు తీసుకునే వెసులుబాటు, రవాణా నిబంధనల సడలింపు వంటివి పెద్ద ప్రభావం చూపవని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. వడ్డీ రాయితీ పై దృష్టి సారించటంతో పాటు కనీసం పరిశ్రమలను ఆదుకునేందుకు 6నెలల వరకూ వివిధ అంశాలకు వెసులుబాటు కల్పిస్తేనే ప్రయోజనకరమని వెల్లడిస్తున్నారు.