కరోనా కష్టకాలంలోనూ తెలంగాణలో మద్యం విక్రయాల జోరు తగ్గలేదు. గత నెలలో అమ్మకాలు జరిగిన 26 రోజుల్లో రూ.2,770 కోట్ల విక్రయాలు జరగ్గా.. ఈ నెలలో శుక్రవారం(12వ తేదీ) వరకు రూ.900 కోట్లకు పైబడి లిక్కర్ అమ్మకాలు జరిగాయి. మద్యం అమ్మకాల సమయం రెండు గంటలు పెంచడం, రాష్ట్ర సరిహద్దు జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్లోకి అక్రమంగా మద్యం తరలిపోతున్న నేపథ్యంలో విక్రయాలు మరింత ఊపందుకున్నాయి.
రాజధానిలో..
16శాతం మద్యం ధరలు పెరిగినప్పటికీ హైదరాబాద్ జిల్లాలో ఆశించిన స్థాయిలో అమ్మకాలు పెరగలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో గత ఏడాది ఇదే సమయంలో రూ.77.57 కోట్ల మేర విక్రయాలు జరగ్గా.. ఈ ఏడాది అదే సమయంలో రూ.83.63 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో గత ఏడాది జూన్లో 12వ తేదీ వరకు రూ.82.50 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా... ఈ ఏడాది అదే సమయంలో ఏకంగా రూ.175.51 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది.
ఏపీకి పెద్ద ఎత్తున..
ఇక పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లోకి మద్యం పెద్ద ఎత్తున అక్రమంగా తరలుతోంది. ఏపీలో మద్యంపై 70శాతానికిపైగా ధరలు పెంచడం, రాష్ట్రంలో కేవలం 16శాతం మాత్రమే ధరలు పెరగిన తరుణంలో మద్యం అక్రమ రవాణా జరుగుతోంది. రాష్ట్ర సరిహద్దు జిల్లాలైన మహబూబ్నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి ఏపీకి పెద్ద ఎత్తున సరఫరా అవుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి 12వ తేదీ వరకు రూ.71 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది అదే సమయంలో రూ.105 కోట్ల మద్యం అమ్ముడు పోయింది.