మూడోసారి ఆడపిల్లే పుట్టిందని విష ప్రయోగంతో ఆ చిన్నారి ఆయువు తీసిన తల్లిదండ్రులకు తెలంగాణలోని నల్గొండ జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎంవీ రమేష్ గురువారం యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రాసిక్యూషన్, కొండమల్లేపల్లి సీఐ పి.పరశురాం వెల్లడించారు. నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం పడమటి తండాకు చెందిన రమావత్ జయరాం, నాగమణి దంపతులు కూలీలు. వీరికి మొదటి సంతానంగా ఆడపిల్ల జన్మించింది. రెండో కాన్పులోనూ అమ్మాయి పుట్టి, పురిట్లోనే మరణించింది.
కుమారుడి కోసం నాగమణి 2016లో మరోసారి గర్భం దాల్చగా, అదే ఏడాది డిసెంబరులో మళ్లీ అమ్మాయే పుట్టింది. పాపను సాకలేమని చెబుతూ... బిడ్డ ఆరోగ్యం, ఆలనాపాలనాపై తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహించారు. ఈ విషయాన్ని స్థానిక అంగన్‌వాడీ టీచర్ కొండమ్మ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. 2017 జనవరిలో అప్పటి దేవరకొండ క్లస్టర్ సీడీపీవో భూక్యా సక్కుభాయ్ తండాకు చేరుకుని, చిన్నారిని నల్గొండ శిశు గృహానికి తరలించారు.