తెలంగాణలోని మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామ శివారులో గత రెండు రోజులుగా చిరుత సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి చాటింపు వేయించారు. రైతులు పొలాల నుంచి ఇంటికి వస్తున్న సమయంలో చిరుత పులి రోడ్డుపై కనిపించడంతో గ్రామస్థులంతా భయాందోళనతో ఇళ్లకు చేరుకున్నారు.
పశువులపై దాడి
గత కొంతకాలంగా ఓ చిరుత దాని పిల్లలు గ్రామ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. నర్సంపల్లి తండా వద్ద ఉన్న గుట్టపై చిరుతపులి స్థావరం ఏర్పాటు చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. అప్పుడప్పుడు చిరుతపులి పరిసర గ్రామాల ప్రజలకు కనిపించి ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది. రామాయంపేట మండలంలోని తొలి గండ్ల, లక్ష్మాపూర్, సుతార్పల్లి తదితర గ్రామాల పరిధిలో రైతుల వ్యవసాయ క్షేత్రాల వద్ద పశువులు, మేకలు, గొర్రెలపై దాడి చేస్తూ వాటిని చంపి తింటున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పదుల సంఖ్యలో జీవాలు చిరుతకు ఆహారంగా మారాయి.