ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ముప్పతిప్పలు పెట్టింది... ఎట్టకేలకు చిక్కింది - రాజేంద్రనగర్​లో చిరుత కలకలం న్యూస్

హైదరాబాద్​లోని రాజేంద్రనగర్‌లో కొంత కాలంగా సంచరిస్తూ... ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న చిరుత ఎట్టకేలకు చిక్కింది. పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా విస్తృత గాలింపు చేపట్టి చివరకు బంధించారు. అధికారులు వైద్యం కోసం చిరుతను జూపార్కుకు తరలించారు.

ముప్పతిప్పలు పెట్టింది... ఎట్టకేలకు చిక్కింది
ముప్పతిప్పలు పెట్టింది... ఎట్టకేలకు చిక్కింది

By

Published : Oct 11, 2020, 7:10 PM IST

ఆరునెలల క్రితం మార్చిలో మొదటిసారిగా రాజేంద్రనగర్ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఎన్​ఐఆర్​డీ సమీపంలో అడవి పందిని చంపినట్టు గుర్తించారు. అనంతరం గగన్‌పహాడ్ రోడ్డు మీద సంచరిస్తున్న సీసీటీవీ వీడియోలు అప్పట్లో హల్‌చల్ చేశాయి. తిరిగి జూన్‌లో మరో అడవిపందిపై దాడి చేసి... జీవీకే గార్డెన్ దగ్గర స్విమ్మింగ్‌పూల్‌లో నీళ్లు తాగటం స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేసింది.

ఫలితం దక్కలేదు..

అధికారులు పట్టుకునేందుకు ప్రయత్నించగా... తప్పించుకుని సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి పారిపోయింది. నెలకో లేగదూడను చంపుతూ అధికారులకు సవాలు విసిరింది. అప్పటినుంచి అధికారులు సీసీ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినా... ఫలితం లేకపోయింది.

గాయాలయ్యాయి..

తప్పించుకుపోయిన చిరుత శనివారం మళ్లీ రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వాలంతరి వద్ద ఓ పశువుల పాకలోకి ప్రవేశించి అక్కడ ఉన్న ఆవుదూడలను చంపింది. రంగంలోకి దిగిన శంషాబాద్‌ రేంజ్‌ అటవీ అధికారుల బృందం సీసీ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు. చిరుతకు ఎరగా బోనులో నిన్న చనిపోయిన దూడలను ఉంచగా... వాటికోసం వచ్చి ఎట్టకేలకు చిక్కింది. బోనులోనుంచి తప్పించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసిన చిరుతకు గాయాలయ్యాయని... చికిత్స తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాలతో అడవిలో వదులుతామని అటవీ శాఖ అధికారి వెల్లడించారు.

చిరుత సంచారంతో నెలల తరబడి భయంలో మగ్గుతున్న స్ధానికులు ఉపశమనం పొందారు. చిరుత మనుషులమీద దాడి చేయలేదని... ప్రజలు ఎవరూ భయాందోళన పడవద్దని పోలీసులు, అటవీఅధికారులు తెలిపారు. చిరుతను పట్టుకున్న అధికారులు వైద్యం కోసం జూపార్కుకు తరలించారు.

ముప్పతిప్పలు పెట్టింది... ఎట్టకేలకు చిక్కింది

ABOUT THE AUTHOR

...view details