స్వాతంత్య్ర పోరాటంలో ఎలాంటి భాగస్వామ్యమూ లేని భాజపా, ఆర్ఎస్ఎస్లు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో.. కులమతాలు చొప్పించే ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. అల్లూరి 125వ జయంతి సందర్భంగా విజయవాడ బాలోత్సవ్ భవన్లో వామపక్షపార్టీలు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీని విమర్శిస్తే.. దేశాన్ని అవమానించినట్లేనని భాజపా కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడటం శోచనీయమన్నారు. ప్రస్తుత భాజపా పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆయన మండిపడ్డారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబురావు మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లుగా విభజన హామీలు, ప్రత్యేక హోదా అమలు అంశాన్ని అటకెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లూరి జయంతి సందర్భంగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
మోదీకి ఆ అర్హత లేదు: ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన ప్రధాని మోదీకి రాష్ట్రానికి వచ్చి అల్లూరి విగ్రహం ఆవిష్కరించే అర్హత లేదంటూ.. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏలూరు జ్యూట్ మిల్ సెంటర్లోని అల్లూరి విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. "నరేంద్ర మోదీ గో బ్యాక్" అంటూ నల్లజెండాలతో నిరసన చేపట్టారు. మహనీయుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత.. ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని మోసం చేసిన మోదీకి లేదన్నారు. భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వస్తున్న మోదీని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకించాలన్నారు. నిరసన కార్యక్రమంలో సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి చింతకాయల బాబురావు, సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి డేగ ప్రభాకర్ రావు, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి వెంకటేశ్వరరావు తదితరలు పాల్గొన్నారు.