కొవిడ్-19 రెండోదశ తగ్గుతుండటంతో.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగ నియామకాల సందడి మొదలైంది. నియామకాలపై ఈ ఏడాది మొదట్లో ఇంజినీరింగ్ విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాల్లో కొంత సందిగ్ధత నెలకొన్నా.. ఇప్పుడు ఎంపిక ప్రక్రియ వేగవంతమైంది. విప్రో సంస్థ గతంలో పరీక్ష రాసి, అర్హత సాధించిన వారిని ఇప్పుడు మౌఖిక పరీక్షలకు పిలిచింది. మానవవనరుల అవసరాలు పెరగడంతో గతంలో పరీక్షలో ప్రతిభ చూపిన వారిని ఇంటర్వ్యూలకు పిలిచింది. టీసీఎస్ రెండో జాబితాను విడుదల చేసి, ఇంటర్వ్యూలు పూర్తి చేసింది. సంస్థలకు ప్రాజెక్టులు పెరుగుతుండటంతో ఫ్రెషర్ల నియామకాలకు ప్రకటనలు ఇస్తున్నాయి. టీసీఎస్ నింజా ప్రకటన విడుదల చేసింది. దీంతో కళాశాలలు విద్యార్థుల సన్నద్ధతపై దృష్టిసారించాయి. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలపై శిక్షణ ఇస్తున్నాయి.
సిద్ధమైన కంపెనీలు..
టీసీఎస్ 2021-22 సంవత్సరానికి 40 వేలకు పైగా ఫ్రెషర్ల నియామకానికి సిద్ధమైంది. ఇన్ఫోసిస్ 2022 ఆర్థిక సంవత్సరానికి 35 వేలు, విప్రో 2023 సంవత్సరానికి 30 వేల నియామకాలు చేపట్టాలని భావిస్తున్నాయి. టీసీఎస్ నింజాకు ఆగస్టు 15లోపు దరఖాస్తు చేసుకోవాలి.. 30 నుంచి నియామక ప్రక్రియ మొదలుకానుంది. కాగ్నిజెంట్ కొన్ని కళాశాలల్లో క్యాంపస్ కనెక్ట్ నిర్వహించబోతోంది. డీఎక్సీ కంపెనీ ఇప్పటికే ఎంపికలు మొదలుపెట్టింది. క్యాప్‌జెమినీ ఆగస్టు మొదటివారంలో నియామకాలు చేపట్టనుంది. గత ఫిబ్రవరిలోనే ఇన్ఫోసిస్ ఇన్ఫిటీక్యూ పూర్తి చేసింది. ఎంపిక చేసిన కళాశాలల్లో త్వరలో ఉద్యోగాల ప్రక్రియ మొదలుపెట్టనుంది. యాక్సెంచర్ విడతల వారీగా నియామకాలు కొనసాగిస్తోంది.
వ్యక్తిగత సాధన ముఖ్యమే..
సాఫ్ట్‌వేర్ కంపెనీలు విద్యార్థుల ఆన్‌లైన్ సాధనను పరిశీలిస్తున్నాయి. కరోనాతో కళాశాలలు మూతపడ్డాయి. ఆన్‌లైన్ తరగతులు, సాధన కొనసాగుతున్నాయి. కొన్ని కంపెనీలు హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్‌లాంటి ఓపెన్ ప్లాట్‌ఫామ్‌లో విద్యార్థుల సాధన తీరు చూస్తున్నాయి. లీడర్‌బోర్డులో స్కోరును పరిశీలిస్తున్నాయి. కోడింగ్ సాధన చేస్తున్నారో లేదోనని ఓ కన్నేస్తున్నాయి. కాగ్నిజెంట్ డబ్ల్యూ3 స్కూల్ ప్రాక్టీస్ చేయాలని సూచిస్తోంది. ఈ కంపెనీ నియామకాలు ఉండే కళాశాలలు దీన్ని విద్యార్థులతో చేయిస్తున్నాయి.
- కరోనా కారణంగా పరీక్ష నుంచి మౌఖిక పరీక్ష వరకు అంతా వర్చువల్‌లోకి మారిపోయింది. కృతిమమేథ (ఏఐ)తో పరీక్ష, ఇంటర్వ్యూలను కంపెనీలు పరిశీలిస్తున్నాయి. విద్యార్థులు పరీక్షల రాసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే మధ్యలోనే ఆన్‌లైన్ పరీక్ష ఆగిపోతుందని పీవీపీ సిద్దార్థ ప్రాంగణ నియామక అధికారి రమేష్ వెల్లడించారు. ఇంటర్‌నెట్ కనెక్షన్, వెలుతురు వచ్చే గది, గదిలో నీడ లేకుండా చూసుకోవాలని సూచించారు. వర్చువల్ పరీక్ష, ఇంటర్వ్యూలకు ఇచ్చే మార్గదర్శకాలను విద్యార్థులు చదివి, అర్థం చేసుకోవాలన్నారు. కోడింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని వెల్లడించారు.
విద్యార్థులు సన్నద్ధం కావాలి