సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణతోనే అసలు వాస్తవాలు బయటపడతాయని, బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందని సలాం పోరాట సమితి ఆర్గనైజింగ్ కన్వీనర్ ఫారూఖ్ షిబ్లీ పేర్కొన్నారు. విజయవాడలో అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి సమావేశమై.. పోరాట కార్యాచరణను ప్రకటించింది. దీక్షను ముస్తాక్ విరమించుకున్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. ఆయన దీక్షను వాయిదా వేశారని స్పష్టం చేశారు. అధికార పార్టీ నేతల అండతోనే.. సలాం కుటుంబంపై కిరాతకంగా పోలీసులు వ్యవహరించారని ఆక్షేపించారు. కాల్ లిస్టును బయట ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. బాధ్యులైన పోలీసులను ప్రభుత్వం కేవలం సస్పెండ్ మాత్రమే చేసిందని.. వారందరినీ డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకుంటే.. మంగళవారం నుంచి విజయవాడలో దీక్ష చేస్తామన్నారు.
'సలాం కుటుంబం ఆత్మహత్యపై సీబీఐతో విచారణ జరిపించాలి'
కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసుల వేధింపులు తట్టుకోలేక ముస్లిం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని.. అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి డిమాండ్ చేసింది. స్థానిక పోలీసులతో విచారణ చేయిస్తే కుటుంబానికి న్యాయం జరగదని... రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందనే నమ్మకం లేదని పోరాట సమితి నేతలు తెలిపారు.
అబ్దుల్ సలాం ఆత్మహత్యను ప్రభుత్వం చేయించిన హత్య అని కాంగ్రెస్ నేత నరహరి శెట్టి నరసింహారావు ఆరోపించారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని తనపై దాడి జరిగిపుడు జగన్మోహన్ రెడ్డే చెప్పారని.. అప్పట్లో సీబీఐ విచారణ కోరిన జగన్.. ఇప్పుడు ఈ కేసును ఎందుకు సీబీఐకి అప్పగించరో చెప్పాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా.. సలాం విషయంపై ఎందుకు స్పందించడం లేదని ఆప్ పార్టీ నేతలు ప్రశ్నించారు. నంద్యాల వైకాపా ఎమ్మెల్యే సహా ఇతర నేతలు ఘటన వెనక ఉన్నారని పోరాట సమితి నేతలు ఆరోపించారు.
ఇదీ చదవండి:క్లీనర్‌ను దారుణంగా చంపి... లారీలో పోలీస్ స్టేషన్‌కి మృతదేహాన్ని తీసుకొచ్చిన డ్రైవర్