ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఈ వాచ్​' యాప్​పై ప్రభుత్వం కోర్టులో పిటిషన్ వేయకపోతే ఆశ్చర్యం: నిమ్మగడ్డ - 'ఈ వాచ్‌' యాప్ న్యూస్

ఎస్‌ఈసీ రూపొందించిన 'ఈ వాచ్‌' యాప్‌ ను ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆవిష్కరించారు. పంచాయతీ ఎన్నికల ఫిర్యాదుల స్వీకరణకు 'ఈ వాచ్‌' యాప్ ఉపయోగపడుతుందని నిమ్మగడ్డ తెలిపారు. యాప్​పై ప్రభుత్వం కోర్టుకు వెళ్లకుంటే ఆశ్చర్యమని.. వెళితే ఆశ్చర్యం ఏముందని నిమ్మగడ్డ వాఖ్యానించారు.

Launch of e-Watch
Launch of e-Watch

By

Published : Feb 3, 2021, 11:46 AM IST

Updated : Feb 3, 2021, 9:31 PM IST

పంచాయతీ పోరుకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు ఎన్నికల కమిషన్ సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆధారాలతో సహా నేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించింది. దీని కోసం 'ఈ వాచ్' పేరిట ప్రత్యేక యాప్​ను అందుబాటులోకి తెచ్చింది. దాడులు, అక్రమాలు, వేధింపులు, అరాచకాలు, తదితర సమస్యలపై ఫిర్యాదు చేసిన మరుక్షణం అధికారులు రంగంలోకి దిగేలా వ్యవస్థను ఏర్పాటుచేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ప్రజలంతా 'ఈ వాచ్' యాప్​ను వినియోగించుకుని ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని ఎస్​ఈసీ విజ్ఞప్తి చేశారు.

పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అధికారుల అక్రమాలపై ప్రజలు నేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్​ను అందుబాటులోకి తెచ్చారు. 'ఈ వాచ్ ' పేరిట రూపొందించిన యాప్​ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆవిష్కరించారు. ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబు, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

పారదర్శకత కోసమే..

వ్యవస్థలో పారదర్శకత కోసమే టెక్నాలజీ వినియోగించుకుంటున్నామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా ఎన్నికలు జరిపేందుకు యాప్​ను తీసుకువస్తున్నట్లు తెలిపారు. అలాగని మిగిలిన యాప్ లపై తమకు అపనమ్మకం లాంటిదేదీ లేదన్నారు. సాంకేతికత వినియోగించి ఎన్నికల్లో అక్రమాలు నివారిస్తామన్నారు. ఎన్నికల సంఘం అవసరాల మేరకు 'ఈ వాచ్' యాప్ తయారు చేశామని, రిలయన్స్ జియో సహకారంతో తక్కువ ఖర్చుతో సమర్థంగా యాప్ తయారు చేసినట్లు వెల్లడించారు. ఫిర్యాదు చేసే ప్రతి వ్యక్తికీ ఓ నెంబర్ ఇస్తామని.. ఆ నెంబర్ సహాయంతో ఫిర్యాదుకు సంబంధించి పరిస్థితి ఎప్పటికప్పుడు ఫిర్యాదుదారు తెలుకోవచ్చని నిమ్మగడ్డ తెలిపారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును ఖచ్చితంగా పరిష్కరిస్తామని ఎస్ ఈసీ హామీ ఇచ్చారు. వచ్చిన ప్రతి సమస్య పైనా తీసుకున్న చర్యలను ఫిర్యాదు దారుకు తెలియజేస్తామన్నారు.

అధికారుల పర్యవేక్షణ

యాప్​ను అధికారులే పర్యవేక్షిస్తున్నారని.., బయటి వ్యక్తులను ఎవరినీ పర్యవేక్షణకు తీసుకోవడం లేదని ఎస్​ఈసీ స్పష్టం చేశారు. సీనియర్ అధికారి పర్యవేక్షణలో కాల్ సెంటర్ నడుస్తుందన్నారు. తీసుకున్న చర్యలపై సంతృప్తి చెందారా? లేదా? అనే విషయంపైనా ఫిర్యాదుదారు అభిప్రాయం తెలుసుకుంటామన్నారు. సీరియస్ ఫిర్యాదులను జిల్లా కలెక్టర్, ఎస్పీలు వెంటనే పరిష్కారించాలన్నారు. మిగిలిన సమస్యలను గరిష్టంగా 3 గంటల్లో పరిష్కరించాల్సిన బాధ్యత వారిదే అన్నారు. సమస్యలు పరిష్కారంలో వారు విఫలమైతే ఎన్నికలు నిలిపివేసే పరిస్థితి వస్తుందన్నారు. "ఈ వాచ్" యాప్ జయప్రదం అవుతుందని తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.

ఈసారి ఎక్కువ మంది నామినేషన్లు

అధికార యంత్రాంగం నిబద్ధతతో వ్యవహరిస్తోందన్న ఎస్​ఈసీ వారు తీసుకుంటోన్న చర్యల వల్ల ఈ సారి ఎన్నికల్లో ఎక్కువ మంది నామినేషన్లు వేస్తున్నారని నిమ్మగడ్డ రమేష్​కుమార్ అన్నారు. తాను నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ సూచనలు, సలహాలు ఇస్తుంటానన్నారు. మామూలుగా జరిగే ఏకగ్రీవాలను తాము పట్టించుకోమన్న ఎస్ఈసీ... ఏకగ్రీవాలు అసాధారణంగా జరిగితేనే దాన్ని తీవ్రంగా పరిగణిస్తామన్నారు. అసాధారణ ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగితే వ్యవస్థలో వైఫల్యంగా భావించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈసారి అసాధారణ ఏకగ్రీవాలు గణనీయంగా తగ్గుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి ఒక్కరు ఓటేయ్యాలి

బయట ప్రాంతాల్లో ఉన్న వారంతా సొంత గ్రామాలకు చేరుకుని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని నిమ్మగడ్డ కోరారు. ఈ వాచ్ యాప్​పై రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో పిటిషన్ వేసిన అంశాన్ని ప్రస్తావించగా.. 'ఈ వాచ్' యాప్ పై ప్రభుత్వం కోర్టులో పిటిషన్ వేయకపోతే ఆశ్చర్యమని.. ప్రభుత్వం కోర్టుకి వెళితే అందులో ఆశ్చర్యం ఏముందని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు చెప్పిన తరవాత ఇవన్నీ ఎందుకన్నారు. వెయ్యి శాతం పారదర్శకతతో యాప్ రూపొందించామని, సందేహాలు, ప్రశ్నలకు తావు లేకుండానే యాప్ పనితీరు ఉంటుందన్నారు. తాను సమావేశాలతో కాలం గడపనని.. పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానన్నారు. తక్కువ మాట్లాడి ఎక్కువగా పనిచేస్తానన్నారు.

ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయోచ్చు

ఈ వాచ్ యాప్ పనితీరు విధానాన్ని ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబు వివరించారు. ఇన్ హౌస్​లోనే మొబైల్ అప్లికేషన్ తయారు చేశామని, నిర్వహణ కోసం రిలయన్స్ జియో సంస్థ సహకారంతో కేవలం 5 లక్షల రూపాయలతో వ్యవస్థను తీసుకుంటున్నామన్నారు. కంప్యూటర్​లో మొబైల్​లో రెండింటి ద్వారా పనిచేస్తుందన్నారు. యాప్​తో ఎవరైనా ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. డబ్బు, మద్యం పంపిణీ, లౌడ్ స్పీకర్లు, ఉద్యోగుల విధుల్లో అలసత్వం తదితర అంశాలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని కన్నబాబు తెలిపారు.

ఫిర్యాదుదారు వివరాలు గోప్యం

ఫిర్యాదుదారులు ఘటనకు సంబంధించి ఫొటోలు, వీడియోలు 5ఎంబీ వరకు పంపవచ్చన్నారు. ముందుగా కాల్ సెంటర్​కు తర్వాత కలెక్టర్ కు ఫిర్యాదు వెళ్తుందని, ముఖ్యమైన ప్రతి ఫిర్యాదును ఎస్ఈసీ పరిశీలించి తగు నిర్ణయాలు తీసుకుంటారని ఎన్నికల సంఘం కార్యదర్శి స్పష్టం చేశారు. చేసిన ఫిర్యాదు ట్యాంపరింగ్ చేసేందుకు తావుండదన్నారు. సీరియస్ ఫిర్యాదు అయితే వెంటనే.. మిగిలినవి గరిష్టంగా ౩ రోజుల్లో సమస్యను పరిష్కారం చేస్తామన్నారు. ప్రతి కంప్లైంట్​కు సంఖ్య ఇస్తామని దీనివల్ల తర్వాత ఫిర్యాదుదారు తనిఖీ చేసుకోవచ్చన్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి చేసిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. సమస్య పరిష్కారమయ్యాక కాల్ సెంటర్ నుంచి ఫిర్యాదుదారు అభిప్రాయం తెలుసుకుంటామన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే ఫిర్యాదును రీ ఒపన్ చేసుకునే సదుపాయం కల్పించామన్నారు.

ఈ వాచ్ యాప్​ను రేపట్నించి గుగుల్ ప్లే స్టోర్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దీనితో పాటు ఎస్ ఈసీ ఇప్పటికే ఏర్పాటు చేసి నిర్వహిస్తోన్న కంప్లైట్ సెల్ కూడా పనిచేస్తుందన్నారు. ఎస్ఈసీ కంప్లైట్ సెల్ తో పాటు కాల్ సెంటర్ సమన్వయం చేసుకుని సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

ఇదీ చదవండి:పంచాయతీ ఎన్నికలు... దొడ్డిదారిలో ఏకగ్రీవాలు!

Last Updated : Feb 3, 2021, 9:31 PM IST

ABOUT THE AUTHOR

...view details