Land controversy: సాగుభూమి లేని నిరుపేదలకు కేటాయించే దరఖాస్తు పట్టాలను.. సినీ ప్రముఖులకు మంజూరు చేయడం చర్చనీయాంశమైంది. సినీనటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుల పేరిట దరఖాస్తు పట్టా భూములు మంజూరు చేసినట్టు ఆన్‌లైన్ రెవెన్యూ రికార్డుల్లో బహిర్గతం కావడంతో కొందరు ఆ వివరాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి ‘సినీ ప్రముఖులు కూడా నిరుపేదలా?’ అంటూ విమర్శలు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి-68 గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబరు 412-1ఎలోని 2.79ఎకరాలను ఎం.మోహన్‌బాబు పేరిట, 412-1బిలో 1.40ఎకరాలను విష్ణువర్ధన్ పేరిట పట్టా ఇచ్చారు. 2015లో దరఖాస్తు పట్టాలు మంజూరు చేయగా.. ఆ వివరాలు ప్రస్తుతం బహిర్గతమయ్యాయి. దీనిపైౖ తహసీల్దారు శిరీషను వివరణ కోరగా.. పూర్తి వివరాలు పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు.