భూ వివాదాలు మనుషులను హంతకులుగా మారుస్తున్నాయి. పట్టపగలే కారులో ఉన్న మనుషులపై పెట్రోల్ పోసి నిప్పటించిన ఘటన విజయవాడలో కలకలం రేపుతోంది. తాడేపల్లిలో నివాసం ఉంటున్న మంగళగిరి మండలం రామచంద్రపాలానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి, విజయవాడకు చెందిన కృష్ణారెడ్డి, గంగాధర్, నాగమల్లి దంపతులు పరిచయస్థులు. 2014 నుంచి వీరు రియల్ ఎస్టేట్,పాతకార్లు, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు. వీరికి సంబంధించిన ఓ స్థలం అమ్మే విషయమై నాలుగు రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. సదరు స్థలం కొనుగోలుకు సంబంధించిన పార్టీ ఉందని, వారిని కలిస్తే పని అవుతుందని వేణుగోపాల్ రెడ్డి మిగతా ముగ్గురికి చెప్పాడు. కృష్ణా రెడ్డి , గంగాధర్ , నాగమల్లి కలిసి కారులో బయలుదేరారు. విజయవాడలోని కృష్ణలంక సూబ్రిడ్జి వద్ద వేచి ఉన్న వేణుగోపాలరెడ్డిని ఎక్కించుకున్నారు . అక్కడి నుంచి తాడేపల్లిలోని ఓ హోటల్‌కు వెళ్లారు.
తాడేపల్లిలో కాకుండా విజయవాడలోనే భూమిని కొనుగోలు చేసే పార్టీ ఉందని వేణుగోపాలరెడ్డి చెప్పడంతో తిరిగి వచ్చారు. నగరంలో కాసేపు కారులో తిరిగారు. ఓ దుకాణం వద్ద ఆగి స్వీట్లు కొనుగోలు చేశారు. అనంతరం నగరంలోని నోవాటెల్ హోటల్ లో సమావేశమవుదామని వేణుగోపాల్ రెడ్డి చెప్పాడు. దీంతో హోటల్ సమీపంలో కారు ఆపి నలుగురు వేచి ఉన్నారు. దాదాపు అరగంటసేపు కారులోనే మాట్లాడుకున్నారు. డ్రైవర్ సీటులో వేణుగోపాల్ రెడ్డి కూర్చుని ఉండగా పక్కన కృష్ణారెడ్డి, వెనక సీట్లో గంగాధర్, నాగమల్లి ఉన్నారు. మాటల మధ్యలో వారి నడుమ వివాదం తలెత్తింది. వేణుగోపాల్ రెడ్డి ముందుగానే మద్యం సీసాలో తెచ్చిన పెట్రోల్ ను తన పక్కనే కూర్చున్న కృష్ణా రెడ్డి పై పోసి నిప్పంటించాడు. వెంటనే కారులో నుంచి కిందకు దిగి డోర్ లాక్ వేసి పెద్దగా అరుచుకుంటూ పరారయ్యాడు.
ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో నాగమల్లి, గంగాధర కాళ్లు , చేతులకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో బెంబేలెత్తిపోయిన నాగమల్లి అక్కడి నుంచి పారిపోయింది. ఈ సంఘటనను చూసిన కార్తీక్ అనే డెలివరీ బాయ్ అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి చెప్పాడు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని.. మంటలను ఆర్పి .. బాధితులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న డీసీపీ హర్షవర్ధన్ రాజు ఘటనస్థలాన్ని పరిశీలించారు . కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడు వేణుగోపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వేణుగోపాల్ రెడ్డిని, బాధితుడు గంగాధర్‌ను పోలీసులు విచారిస్తున్నారు.