శాంతిభద్రతలు పరిరక్షించాల్సిన ఓ మహిళా పీఎస్సై ఆత్మహత్యకు యత్నించిన ఘటన విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని అయోధ్యనగర్‌లో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలానికి చెందిన ఓ యువతి గత కొద్ది నెలల క్రితం ఎస్సైగా ఉద్యోగం పొందింది. ప్రస్తుతం ఆమె సత్యనారాయణపురంలో పీఎస్సై(ప్రొబిషనరీ ఎస్సై)గా పనిచేస్తున్నారు. ఈనెల 12వ తేదీ రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అయోధ్యనగర్‌లోని ఇంట్లో ఆత్మహత్యకు యత్నించింది. తాను చనిపోతున్నానని నగరంలోని సీసీఎస్‌లో పనిచేసే ఓ ఎస్సైకు సమాచారం ఇచ్చింది.
వెంటనే ఆయన.. సత్యనారాయపురం సీఐ బాలమురళీకృష్ణకు తెలిపి, ఆమె ఇంటికి చేరుకున్నారు. అజిత్‌సింగ్‌నగర్, సత్యనారాయణపురం పోలీసులు అక్కడకు చేరుకుని ఇంటి తలుపులు పగలకొట్టారు. ఆమె కింద పడిపోయి ఉంది. పక్కన గోళ్ల రంగు, శానిటైజర్ సీసాలు ఉండటంతో.. వాటిని తాగి ఆత్మహత్యకు పాల్పడిఉండవచ్చనే అనుమానంతో సింగ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆత్మహత్యకు యత్నించినందుకు సదరు మహిళా పీఎస్సైపై అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.
మనస్తాపంతోనే..
మహిళా పీఎస్సై ఆత్మహత్య యత్నం ఘటనకు కారణం ప్రేమ వ్యవహారమని తెలుస్తోంది. ఎ.కొండూరుకు చెందిన ఓ ఎస్సైతో ఆమె ప్రేమలో ఉందని, ప్రస్తుతం అతను సీసీఎస్‌లో పనిచేస్తున్నాడని సమాచారం. అతను ఇటీవల ఈమెను కాదని వేరొక యువతిని పెళ్లి చేసుకోవడంతో మనస్తాపంతోనే పీఎస్సై ఆత్మహత్యకు యత్నించిందని సమాచారం.