రాష్ట్రంలో ఎరువుల విక్రయాల్లో పారదర్శకత లోపించింది. కొందరు రైతుల పేరుపైనే వేలాది టన్నుల ఎరువులు, యూరియా విక్రయమైనట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ రికార్డులు చెబుతున్నాయి. ఖరీఫ్ ప్రారంభమయ్యాక ఏప్రిల్, మే, జూన్‌లలో ఒక్కసారిగా ఎరువుల విక్రయం జోరందుకుంది. ఇందులో గరిష్ఠంగా ఎరువులు కొన్న రైతుల జాబితాలను తీయించి స్థానిక అధికారుల ద్వారా కేంద్రం పరిశీలన చేయించింది. ఈ సందర్భంగా విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి.
- ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా వంద మంది రైతులకు 14,942 టన్నుల ఎరువులను విక్రయించారు. ఇందులో 50 మంది రైతుల పేర్లపైనే 10,505 టన్నుల వరకు అమ్మకమయ్యాయి.
- 12మంది పేర్లతో 2,102 టన్నుల యూరియాను విక్రయించారు. మొత్తంగా వంద మంది పేర్లతో అమ్మిన యూరియా 6,500 టన్నుల వరకుంది.
- ఖరీఫ్‌లో అత్యధికంగా ఎరువులు కొన్న వంద మందిలో 35 మంది కర్నూలు జిల్లానుంచే ఉన్నారు. కృష్ణా జిల్లానుంచి 20 మంది, పశ్చిమగోదావరి నుంచి 18 మందిని గుర్తించారు.
- కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన సత్యనారాయణ పేరుతో ఏకంగా 11,300 బస్తాల ఎరువులు కొనుగోలు అయ్యాయి. ఇవన్నీ ఒకే దుకాణం నుంచి తీసుకున్నారు. గోవిందు పేరుతో 11వేలు, సురేశ్‌బాబు పేరుతో 10,960 బస్తాలు కొన్నారు.
- కృష్ణా జిల్లా పెదముత్తేవిలో సీతారాం పేరుతో 7,020 బస్తాల యూరియాను కొన్నారు. ఆయన పేరుపై ఖరీఫ్‌లో మొత్తంగా 10,900 బస్తాల ఎరువులు అమ్మకమయ్యాయి. శివనాగ భవాని పేరుతో 4,760 బస్తాల యూరియాను కొన్నారు. నంద్యాలలోనూ ముగ్గురు రైతుల పేర్లతో 15,600 బస్తాల వరకు యూరియాను విక్రయించారు.
- సాగు వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో లేకపోవడం వల్ల రైతులే కాకుండా ఎవరైనా వేలిముద్ర వేసి ఎరువులు కొన్నట్టు చూపే వీలుంది. దీన్ని కొందరు వ్యాపారులు అవకాశంగా మలుచుకుని తమ దుకాణంలోని సిబ్బంది వేలిముద్రలతో విక్రయించారు. కొందరు నల్లబజారుకు తరలించారు. లాక్‌డౌన్ సమయంలో అమ్మిన ఎరువులను క్రమబద్ధీకరించుకునేందుకు ఇలా చేయాల్సి వచ్చిందని వారు వివరణ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలవారీగా డీలర్లకు అధికారులు నోటీసులనిస్తున్నారు. రైతులను చైతన్యపర్చడంలో విఫలమయ్యారంటూ వ్యవసాయ అధికారులకూ తాఖీదులనిస్తున్నారు.
నియంత్రణపై కేంద్రం దృష్టి
పరిమితికి మించుతున్న ఎరువుల వాడకాన్ని తగ్గించడంతోపాటు విచ్చలవిడి అమ్మకాలకు అడ్డుకట్టవేసే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. రైతు సాగుచేసే పంటలు, వాటి విస్తీర్ణానికి అనుగుణంగా ఎంత పరిమాణంలో ఎరువులు అవసరమవుతాయంటూ రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. ప్రభుత్వాలిచ్చే నివేదికలకు అనుగుణంగా ఎరువుల అమ్మకాలపై పరిమితి విధించేందుకు సన్నాహాలు చేస్తోంది.