ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉరకలేస్తున్న కృష్ణమ్మ.. పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తం - Krishna floods latest news

కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. పరీవాహక ప్రాంతాలన్నీ ముంపుముప్పు ముంగిట నిలిచాయి. అప్రమత్తమైన అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద రెండో ప్రమాదహెచ్చరిక జారీ చేశారు. ఆనకట్టకు ఉద్ధృతి నేపథ్యంలో కరకట్ట కింద ఉన్న చంద్రబాబు నివాసానికి అధికారులు నోటీసులు అంటించారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Krishnamma is crawling .. People in the catchment areas are alerted
ఉరకలేస్తున్న కృష్ణమ్మ.. పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తం

By

Published : Sep 28, 2020, 5:28 AM IST

ఉరకలేస్తున్న కృష్ణమ్మ.. పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తం

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకోగా... దిగువ ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. నిన్నరాత్రే ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ఆనకట్ట వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో భారీస్థాయిలో నమోదవుతోంది.

ఎప్పటికప్పుడు గేట్లు ఎత్తి బ్యారేజ్ నుంచి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. వాగులు పొంగడం వల్ల కృష్ణా నదిలో అదనంగా కొన్ని వేల క్యూసెక్కుల నీరు కలుస్తోంది. ఆనకట్ట నుంచి నీరు విడుదలవడంతో అప్రమత్తమైన సీతానగరం అధికారులు దిగువకు వెళ్లే మార్గాన్ని మూసివేసి రాకపోకలను మళ్లించారు. నదిఒడ్డున ఉన్న చిగురు బాలల ఆశ్రమం నుంచి 70 మంది బాలలు, సిబ్బందిని విజయవాడకు తరలించారు.

వరద ప్రభావిత మండలాల అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ ఇంతియాజ్‌.. ఎస్పీ, సంయుక్త పాలనాధికారులు, సబ్‌ కలెక్టర్లు, ఆర్డీవోలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. బ్యారేజ్‌ దిగువ ప్రాంతవాసులు సురక్షిత స్థలాలకు వెళ్లాలని సూచించారు. కృష్ణా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నదిలో స్నానాలకు వెళ్లరాదని, పశువులను మేతకు తీసుకెళ్లవద్దని హెచ్చరించారు. నదిలో బోట్లు, మోటార్ బోట్లు, స్టీమర్లతో ప్రయాణించొద్దని స్పష్టం చేశారు.

నందిగామలో కట్టలేరు ఉద్ధృత ప్రవాహానికి రాకపోకలు నిలిచిపోయాయి. వాగుకు రెండు వైపులా కంచె వేయించిన పోలీసులు.. ఎవరూ అటువైపు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జగ్గయ్యపేట మండలం రావిరాల గ్రామంలో పర్యటించిన ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను... ప్రజలకు జాగ్రత్తలను సూచించారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని చెప్పారు. కృష్ణమ్మకు పసుపు-కుంకుమ సమర్పించారు.

ప్రకాశం బ్యారేజ్‌కి ఉద్ధృతి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సహా... కరకట్ట దిగువన ఉన్నవారికి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. వరద మరింత పెరిగే అవకాశమున్నందున... అక్కడ ఉండేవారు తగుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం పెదమద్దూరు వద్ద కొండవీటి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో... విజయవాడ-అమరావతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మిర్చి, పత్తి పంట పొలాలు నీట మునిగాయి.

దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలోకి వరదనీరు భారీగా ముంచుకురాగ... అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరీవాహక ప్రాంత క్షేత్రస్థాయి అధికారులను గుంటూరు కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ అప్రమత్తం చేశారు. టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా లంకప్రాంతాల పరిస్థితులను సమీక్షించారు. పెదకొండూరు, గొడవర్రు, వీర్లపాలెం గ్రామాల్లో పంటలు నీటమునిగాయి. పశువులను మేతకు తోలుకెళ్లిన రైతులు.... ఉద్ధృతి పెరగటంతో వెనక్కి వచ్చేశారు.

ఎగువ నుంచి వస్తున్న భారీ వరదకు శ్రీశైలం జలాశయమూ నిండుకుండను తలపిస్తోంది. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో పెద్దఎత్తున నమోదవుతోంది. నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి లక్ష క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో వస్తుండగా... అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో.... విశాఖ జిల్లా మాడుగుల మండలం పెద్దేరు జలాశయం గేట్లు మూసివేశారు.

ఇదీ చదవండీ... 'వైయస్​ఆర్ జలకళ' పథకం ప్రారంభానికి సర్వం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details