రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడికాల్వ నుంచి రెండు టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అంగీకరించింది. హైదరాబాద్ జలసౌధలో జరిగిన బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మే నెల వరకూ గతంలో చేసిన కేటాయింపులు పూర్తవడం వల్ల తాగునీటి అవసరాల కోసం రెండు టీఎంసీల నీరు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం బోర్డును కోరింది. దీంతో ఇవాళ బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డిలతో కూడిన త్రిసభ్య కమిటీ సమావేశమైంది.
నెలాఖరుతో నీటి సంవత్సరం ముగుస్తున్నందున అప్పటి వరకు తాగునీటి అవసరాల కోసం రెండు టీఎంసీల నీరు ఇవ్వాలని ఏపీ కోరింది. ప్రస్తుతం సాగర్‌లో 510 అడుగుల వరకు నీటిని వినియోగిస్తున్నామని, గతంలో అంతకంటె దిగువకు కూడా వెళ్లిన ఉదంతాలను ఆయన గుర్తుచేశారు. అయితే దిగువకు వెళ్లకుండా తెలంగాణ వాటాలో 49 టీఎంసీల నీరు ఉన్నందున సాగర్ కుడి కాల్వ ద్వారా ఆంధ్రప్రదేశ్ కు రెండు టీఎంసీల నీరు విడుదల చేసేందుకు కమిటీ అంగీకరించింది. తమ కోటా పూర్తైందంటూ బోర్డు రాసిన లేఖలో పరిపక్వత లేదన్న ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి... తెలంగాణ చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల సహా నీటి నష్టాలు ఇతర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
"తెలంగాణ చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతలపై పరిగణనలోకి తీసుకోవాలి. నీటి నష్టాలు ఇతర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. గతంలో సాగర్‌లో 502 అడుగుల వరకు నీరు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. 510 అడుగుల నుంచే 2 టీఎంసీల విడుదలకు అంగీకరించారు."
- నారాయణ రెడ్డి, ఏపీ ఈఎన్సీ