ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KRMB: 'ప్రాజెక్టుల వివరాలు త్వరగా సమర్పించండి' - హైదరాబాద్ వార్తలు

హైదరాబాద్​లోని జలసౌధలో.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశమైంది. గెజిట్​ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ ఖరారుపై ఉపసంఘం చర్చలు జరుపుతోంది. సమావేశంలో తెలంగాణ, ఏపీ అంతర్రాష్ట్ర వ్యవహారాల సీఈలు.. రెండు రాష్ట్రాల జెన్‌కో అధికారులు పాల్గొన్నారు.

Krishna river management Board Subcommittee Meeting
కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం

By

Published : Sep 17, 2021, 2:41 PM IST

Updated : Sep 18, 2021, 5:28 AM IST

ప్రాజెక్టులను తమ పరిధిలోకి తెచ్చుకొనే ప్రక్రియను కృష్ణా, గోదావరి బోర్డులు వేగవంతం చేశాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ మేరకు నిర్వహణ, సిబ్బంది, మౌలిక వసతులు, భద్రత, నిధుల కేటాయింపు తదితర అంశాలను తేల్చేందుకుగాను రెండు బోర్డులు ఏర్పాటు చేసిన ఉప సంఘాలు కసరత్తు ప్రారంభించాయి. అక్టోబరు 14 నాటికి గెజిట్‌ అమలుపై రూట్‌మ్యాప్‌ తయారీకి శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో గోదావరి, కృష్ణా బోర్డుల ఉప సంఘాలు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించాయి. షెడ్యూల్‌-2లోని ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ఇవ్వాలని పట్టుబట్టిన గోదావరి బోర్డు, సోమవారం మళ్లీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. గురువారంలోగా అందజేయాలని కృష్ణా బోర్డు కోరింది. ప్రాజెక్టులన్నీ ఒకేసారి కాకుండా దశలవారీగా బోర్డుల పరిధిలోకి తేవడంపై చర్చ జరిగింది. శ్రీశైలం నుంచి నీటిని తీసుకొనే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ వరకు బోర్డు పరిధిలోకి సరిపోతుందని, బనకచర్ల రెగ్యులేటర్‌ అవసరం లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించగా, దీనికి తెలంగాణ అంగీకరించలేదు. గోదావరి బోర్డు ఉప సంఘం సమావేశానికి కన్వీనర్‌ పాండే అధ్యక్షత వహించగా సభ్యుడు కుటియాల్‌ పాల్గొన్నారు. కృష్ణాబోర్డు ఉప సంఘం సమావేశానికి కన్వీనర్‌ రవికుమార్‌ పిళ్లై అధ్యక్షత వహించగా సభ్యులు రాయ్‌పురే, ముతాంగ్‌ పాల్గొన్నారు. తెలంగాణ నుంచి అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం సీఈ మోహన్‌రావు, ఎస్‌ఈ కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి జలవనరుల శాఖ సీఈ శ్రీనివాస్‌రెడ్డి, కేంద్ర జల సంఘం అధికారులు, రెండు బోర్డుల ఇంజినీర్లు పాల్గొన్నారు. ఏపీ జెన్‌కో ఇంజినీర్లు హాజరుకాగా తెలంగాణ నుంచి పాల్గొనలేదు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం చర్చించిన అంశాలు ఇలా ఉన్నాయి.


* గెజిట్‌ ప్రకారం బోర్డుల పరిధిలోకి రానున్న ప్రాజెక్టులకు సంబంధించి మౌలిక సౌకర్యాలు, పరికరాల వివరాలను సమర్పించాలని కన్వీనర్లు రాష్ట్రాలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ మొదట కొన్ని ప్రాజెక్టుల వివరాలే సమర్పించగా, తర్వాత అన్నింటి వివరాలు ఇవ్వాలని వారు కోరడంతో ఇచ్చినట్లు తెలిసింది. ప్రాజెక్టుల వద్ద పని చేయడానికి ఎంత మంది అవసరమైతే అంతమంది సిబ్బంది వివరాలు ఇవ్వాలని, దీనికి తగ్గట్లుగా ఇచ్చిన జాబితాలో మార్పులు చేయాలని తాజాగా సూచించినట్లు సమాచారం. ఉన్నతాధికారులతో చర్చించి వివరాలు అందజేస్తామని తెలంగాణ పేర్కొంది. తాజాగా అడిగిన సమాచారం ఇవ్వడానికి సమయం పడుతుందని రెండు రాష్ట్రాలు చెప్పగా, సోమవారం మళ్లీ సమావేశం ఏర్పాటు చేస్తామని ఆరోజు ఇవ్వాలని గోదావరి బోర్డు అధికారులు సూచించారు. గురువారంలోగా ఇవ్వాలని కృష్ణాబోర్డు వారు చెప్పారు. జెన్‌కోకు సంబంధించిన వివరాలు రెండు రాష్ట్రాలూ ఇవ్వలేదని సమాచారం.


* పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ బోర్డు పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో దాని కింద ఉన్న బనకచర్ల అవసరం లేదని ఏపీ పేర్కొంది. ఎంత నీటిని తీసుకొనేది పోతిరెడ్డిపాడు వద్ద తెలిసిపోతుంది కాబట్టి దిగువన ఉన్న బనకచర్ల అవసరం లేదని, ప్రాజెక్టులన్నీ ఒకేసారి తీసుకోవడం వల్ల ఆచరణలో సమస్యలు వస్తాయని, దశలవారీగా తీసుకోవాలని సూచించింది. ఈ విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్తామని కృష్ణాబోర్డు ఉపసంఘం కన్వీనర్‌ రవికుమార్‌ పిళ్లై పేర్కొన్నట్లు తెలిసింది. బనకచర్ల కూడా ఉండాల్సిందేనని, ఈ అంశాలన్నీ తమపై అధికారులతో చర్చిస్తామని తెలంగాణ ప్రతినిధులు పేర్కొన్నట్లు సమాచారం.


* ప్రాజెక్టుల వద్ద కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌) ఏర్పాటుకు సంబంధించి ఉన్న మౌలిక వసతుల వివరాలు అందజేయాలని రెండు బోర్డులు కోరాయి. ఎలాంటి సౌకర్యాలు లేకపోతే ఆ విషయాన్ని అయినా తెలపాలని సూచించాయి.


* ప్రాజెక్టుల నిర్వహణకు (ఆపరేషన్‌- మెయింటెనెన్స్‌) సంబంధించి రూ.కోటిపైగా ఉన్న కాంట్రాక్టుల వివరాలు అందజేయాలని కన్వీనర్లు కోరారు.

ఇదీ చూడండి:

Buddha Venkanna : జగన్​రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది: బుద్ధా వెంకన్న

Last Updated : Sep 18, 2021, 5:28 AM IST

ABOUT THE AUTHOR

...view details