కృష్ణానదికి ఎగువ నుంచి వరద భారీగా వస్తోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద మొత్తం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గేట్లు అన్నీ ఒకేసారి ఎత్తడం కారణంగా... వరద నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. కృష్ణలంకలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. బెజవాడలోని తారకరామనగర్, కోటినగర్, పోలీసు కాలనీల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు కొంతమంది కట్టుబట్టలు, సామాన్లతో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.
ప్రకాశం బ్యారేజీ దిగువన తోట్లవల్లూరు వద్ద నదీ పాయలోని లంకగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాముల లంక, కలింగలంక, తోడేళ్ల దిబ్బ, రావి చెట్టు దిబ్బ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎమ్మెల్యే అనిల్ పడవపై లంక గ్రామాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. తోడేళ్ల దిబ్బలంకలో ఉన్న గ్రామస్థులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నించగా... స్థానికులు నిరాకరించారు. ముంపులో చిక్కుకున్న చల్లపల్లి మండలంలోని ఆముదార్లంక వాసులను పునరావాస కేంద్రాలకు చేర్చారు.