ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ... బెజవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. కృష్ణా కరకట్ట, ప్రకాశం బ్యారేజీకి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు చేరటంతో... కృష్ణలంక, భూపేశ్‌గుప్తానగర్ కాలనీలను రెవెన్యూ యంత్రాంగం ఖాళీ చేయించింది. తీరప్రాంతాల్లోని కాలనీవాసులు రెండు, మూడు రోజులుగా కట్టపైనే జీవనం సాగిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినా...ఇంట్లో సరకులు పోతాయేమోననే భయంతో బాధితులు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. భూపేష్ గుప్తానగర్ కాలనీ వీధులు కాలువల్లా మారాయి. ఆ నీటిలోనే వల వేసి చేపలు పడుతున్నారు. రాత్రులు చీకట్లోనే ఉంటున్నామని, పాములు, తేళ్లు వస్తున్నాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు. రిటర్నింగ్ వాల్ పూర్తిస్థాయిలో నిర్మిస్తే తమకు ఏటా ఈ కష్టాలు పడే బాధ తప్పుతుందని చెబుతున్నారు.
పులిచింతల నుంచి వస్తున్న వరద సముద్రంలోకి చేరే మధ్యలో...లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది. నందిగామ మండలంలో ఏటిపట్టు గ్రామాలు వరదకు విలవిల్లాడుతున్నాయి. గని ఆత్కూరు గ్రామం మధ్యలో నిర్మించిన కాజ్‌వే పై నుంచి వరదనీరు ప్రవహించటంతో...రాకపోకలు నిలిచిపోయాయి. వరద మరింత పెరిగితే ఇళ్లలోకి నీరు వస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదనీరు ఇబ్రహీంపట్నం పుష్కర్‌నగర్‌లోని గృహాల్లోకి చేరింది. మూలపాడులో పంటలు నీటమునిగాయి.
తోట్లవల్లూరు మండల పరిధిలో...కృష్ణా నదిని ఆనుకుని ఉన్న పంట పొలాలు నీటమునిగాయి. తోడేళ్లదిబ్బ, పాములంక, పొట్టిదిబ్బలంక, పిల్లివానిలంక, తుమ్మల పిచ్చిలంక గ్రామాల్లోని పసుపు, కంద, చెరుకు, తమలపాకు, మినుము పంటలు పూర్తిగా మునిగిపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది పంట నష్ట పరిహారమే ఇంతవరకూ ఇవ్వలేదని... ఈసారి నష్టం తీవ్రంగా ఉండటంతో ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు.