రాష్ట్రంలో కొవిడ్ 19 వాక్సినేషన్ కోసం ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలి విడతలో కోటి మంది జనాభాకు వాక్సినేషన్ చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. మొదటగా 3.6 లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి, ప్రభుత్వ-ప్రైవేటు రంగాల్లోని 7 లక్షల మంది ఫ్రంట్ లైన్ సిబ్బందికి వాక్సినేషన్ చేయాలని భావిస్తున్నారు.
వైద్యులు, పోలీసులు, ప్రభుత్వ-ప్రైవేటు ఆస్పత్తుల్లోని సిబ్బంది ఇతర ఉద్యోగులకు వాక్సిన్ వేయనున్నారు. అలాగే 50 ఏళ్ళ వయసు దాటిన 90 లక్షల మందికి కూడా కొవిడ్ వాక్సినేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో మూడు నెలల్లో వాక్సిన్ను రాష్ట్రానికి పంపనున్నట్లు కేంద్రం ఇప్పటికే సమాచారం పంపింది. మొత్తం వాక్సినేషన్ చేసేందుకు 90 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు, ఆశావర్కర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.