కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. విజయవాడలో తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం, ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం, మరో 5 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 300 నుంచి 500 మంది వరకు నమూనాను (స్వాబ్‌ను) సేకరించి, ల్యాబ్‌లకు పంపుతున్నారు. వీటిని నిర్ధారించేందుకు కొన్ని రోజుల సమయం పడుతోంది. ముఖ్యంగా వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్న వారు వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నమూనాలను ఇచ్చిన వారు ఫలితాలు వచ్చే వరకు సహజంగా వివిధ అవసరాల నిమిత్తం రోడ్లపై తిరుగుతున్నారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారు ఇలానే బయటకు వస్తున్నారని, ఇది వైరస్ వ్యాప్తికి కారణం అవుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై అనుమానితులు అవగాహన పెంచుకుని, నిర్ధారణ పరీక్షల నివేదిక వచ్చే వరకు స్వీయ నియంత్రణ పాటించడం మంచిదని సూచిస్తున్నారు. మరోవైపు నగరంలో, జిల్లాలోనూ కొన్ని ప్రాంతాల్లో కరోనా తీవ్రత నెలకొంది. ఇలాంటి హాట్ స్పాట్‌లను గుర్తించి, కరోనా నియంత్రణ చర్యలు చేపట్టడం ద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని సూచిస్తున్నారు.
అవగాహనతోనే ఆక్సిజన్ సమస్యకు పరిష్కారం
ప్రాణ వాయువు ఎవరికి అవసరమనే విషయమై అవగాహన కలిగి ఉండడం ద్వారా ఈ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుందని చెబుతున్నారు. ఆక్సిజన్ 96 శాతం ఉన్న వారికి ఇది అవసరం లేకపోయినా, వారిలో ఆందోళన నెలకొన్న కారణంగా ముందుగా వచ్చిన రోగికి ప్రాణ వాయువు ఇవ్వాల్సి వస్తోంది. ఇదే తరుణంలో ఆక్సిజన్ 70 శాతానికి పడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉండి, వెనుక వచ్చిన వారికి లభించని పరిస్థితి ఏర్పడింది. ఆక్సిజన్‌తో కూడిన పడకలో వైద్యం పొందిన వారు కోలుకున్న అనంతరం డిశ్ఛార్జ్ అయినా, పలు ప్రైవేటు ఆసుపత్రుల వారు సదరు పడకలను ఖాళీగా చూపించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. పడకలపై ఉన్న రోగులకు ఆక్సిజన్ సరఫరా చేసే తరుణంలో వృథాను అరికట్టడం మరో ఘట్టం. గ్రామ/వార్డు సచివాలయాల్లో ఎ.ఎన్.ఎం.ల వద్ద ఆక్సీ మీటర్లను అందుబాటులో ఉంచినట్టు చెబుతున్నారు. దీంతో ప్రాథమికంగా ఎవరికి ఆక్సిజన్ అవసరమో నిర్ధారించవచ్ఛు వెరసి ఆక్సిజన్‌ను జిల్లాకు రప్పించడం ఎంత ముఖ్యమో, దీన్ని అవసరాలకు సరిపడా వినియోగించడం అంతే ముఖ్యంగా ఉంది. అందుబాటులో ఆక్సిజన్ లేకుంటే, దేహంలో ప్రాణ వాయువు వృద్ధికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటి ద్వారా 10 శాతం ఆక్సిజన్ వృద్ధి చెందుతుందని వైద్య రంగంలోని వారి సలహా.