Ramulavari Kalyana Thalambralu : కోరిన కోర్కెలు తీర్చే కోదండరాముని కల్యాణం కోసం తలంబ్రాలను సిద్ధం చేసే కార్యక్రమం మెుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో మెుత్తం 800 కిలోల వడ్లను రాములవారి కల్యాణం కోసం అత్యంత భక్తిశ్రద్ధలతో తయారు చేయనున్నారు. రామనామ జపం చేస్తూ, దీక్షగా 3 నెలల పాటు సాగే... కోటి గోటి తలంబ్రాల ఏర్పాటుకు భక్తులు శ్రీకారం చుట్టారు.
సీతారాముల కల్యాణ వేడుకను... ఏటా ఊరూవాడా అంగరంగ వైభవంగా జరుపుతారు. భద్రాచలం, ఒంటిమిట్ట రామాలయాల్లో... రాముల వారి కళ్యాణాన్ని చూడడానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. స్వామివారి కల్యాణంలో వినియోగించే తలంబ్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. వడ్ల గింజలను భక్తులే స్వయంగా గోటితో ఒలవడం ద్వారా... సీతారాములకు తలంబ్రాలు తయారు చేయడం విశేషం.
రాములవారి కల్యాణానికి రాజమహేంద్రవరం సమీపంలోని కోరుకొండలో ప్రత్యేకంగా సాగు చేసిన 800 కిలోల ధాన్యాన్ని.. పలు ప్రాంతాల్లోని భక్తులకు పంపుతారు. శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో కొంత ధాన్యాన్ని తీసుకొచ్చి... విజయవాడలోని బాలాజీ హరిహర క్షేత్రంలో భక్తులకు పంచుతారు. వీటిని భక్తులంతా రామనామం జపిస్తూ.... భక్తిశ్రద్ధలతో గోటితో ఒలిచి తలంబ్రాలుగా తయారుచేస్తారు. తరువాత వాటన్నింటిని ఒక్కచోటికి చేర్చి భద్రాచలం, ఒంటిమిట్ట పంపేందుకు సిద్ధం చేస్తారు. ఏప్రిల్ 10న జరిగే సీతారామ కల్యాణానికి రెండు రోజుల ముందే ఈ తలంబ్రాలను పంపుతామని భక్తులు అంటున్నారు.
" గత 11సంవత్సరాలుగా గోటితో వలిచిన కోటి తలంబ్రాలను భద్రాచల సీతారాముల కల్యాణానికి సమర్పిస్తున్నాం. ఈ ఏడాది కూడా అలాగే పంపేందుకు విజయవాడలో ఈరోజు 108సార్లు హనుమాన్ చాలీసా పఠించి అనంతరం వలిచే కార్యక్రమం ప్రారంభించాం. రామనామ స్మరణతో వడ్లను వలుస్తాం. రాములవారికి సమర్పించేందుకు సిద్ధం చేసే ఈ తలంబ్రాల కోసం ప్రత్యేకంగా ధాన్యం పండించి, ఆ పంటను ఆంధ్రా, తెలంగాణలోని 30 మండలాల్లోని 60గ్రామాలకు పంపుతాము. మొత్తం 3వేల మంది రామనామ స్మరణతో గోటితో ఎంతో నిష్ఠగా ఈ వడ్లను వలచి తలంబ్రాలకు సిద్ధం చేస్తారు. " -కల్యాణ అప్పారావు, శ్రీకృష్ణ చైతన్య సంఘం