కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక కేసులో కీలక మలుపు - kondapalli-municipal-chairman-election
![కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక కేసులో కీలక మలుపు కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13979437-1046-13979437-1640172284434.jpg)
15:58 December 22
సీజేకు సమాచారం పంపిన జడ్జి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్
Kondapalli municipal chairman election :కృష్ణా జిల్లా కొండపల్లి పురపాలక సంఘం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారంపై దాఖలైన కేసుల్లో బుధవారం హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యాజ్యాల విచారణ నుంచి వైదొలుగుతున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ ప్రకటించారు. వైకాపా కౌన్సిలర్ల తరఫు న్యాయవాది సీతారాం చాపర్ల విచారణకు అవరోధం కలిగించడంతో అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యాజ్యాలు మరో బెంచ్ ముందుకు విచారణకు వచ్చేలా నిర్ణయం తీసుకునేందుకు రికార్డులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర వద్ద ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. బుధవారం విచారణ సందర్భంగా వైకాపా కౌన్సిలర్ల తరఫు న్యాయవాది సీతారాం జోక్యం చేసుకుంటూ... పిటిషనర్ ఉదహరించిన తీర్పులు ప్రసుత్త వ్యవహారానికి వర్తించవన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ తాను అనుమానాలను ప్రాథమికంగా నివృత్తి చేసుకుంటున్నానని, మీ సమయం వచ్చినప్పుడు వాదనలు వింటామన్నారు. అవతలివైపు న్యాయవాది వాదనలు వినిపించేటప్పుడు కలుగజేసుకోవద్దని సున్నితంగా కోరారు. అయినా మరోసారి జోక్యం చేసుకుని వాదనలు వినిపించేందుకు న్యాయవాది ప్రయత్నించడంతో న్యాయమూర్తి అసహనం వ్యక్తంచేస్తూ బెంచ్ దిగి వెళ్లిపోయారు. మధ్యాహ్నం విచారణ ప్రారంభం కాగానే న్యాయమూర్తి స్పందిస్తూ... ఈ వ్యాజ్యాలను తాను విచారించడంలేదని వేరే బెంచ్‌కు బదిలీ చేస్తున్నానన్నారు.
ఇదీచదవండి :