ప్రకాశం జిల్లాలోని వాడరేవు వివాదానికి రాజకీయ శక్తులే కారణమని మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. వైకాపా నేతలు వారివారి వర్గాలను పెంచి పోషించడానికే ఇటువంటి వివాదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాంలు మత్స్యకారులను తమవైపుకు తిప్పుకోవడం కోసమే వారి మధ్య చిచ్చుపెట్టారని మండిపడ్డారు. అధికారులు, పోలీసులు సకాలంలో స్పందించకపోవటం వల్లే అనేకమంది మత్స్యకారులు గాయాలపాలయ్యారన్నారు.
బీసీలంతా కలిసుంటే తమ ఆటలు సాగవనే వైకాపా ప్రభుత్వం మత్స్యకారుల మధ్య వివాదం సృష్టించిందని ఆరోపించారు. చీరాల నియోజకవర్గంలో మొదలైన చిచ్చు..రాష్ట్రమంతా వ్యాపించకముందే ప్రభుత్వం మత్స్యకారుల మధ్య మొదలైన గొడవను సామరస్యంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల మధ్య వివాదానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.