పన్నుల పేరుతో ముఖ్యమంత్రి జగన్ ప్రజలను దోచుకుంటున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే..వారికి పన్నుల బాదుడు బహుమతిగా ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. "ఇంటి పన్నులు 15 శాతమేగా పెంచుతున్నాం" అని చెబుతున్న మంత్రి బొత్సకు ఆ మొత్తం తక్కువగా కనిపిస్తోందా ? అని మండిపడ్డారు.
పథకాల పేరుతో ప్రజలకు ఎర వేసి పన్నుల పేరుతో లూటీ చేస్తున్నారని రవీంద్ర దుయ్యబట్టారు. కరోనా సమయంలో ఆదాయం లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ప్రజలపై పన్నులు వేయడం సరికాదని హితవు పలికారు. కేంద్రం ఇచ్చే అప్పు కోసం ముఖ్యమంత్రి జగన్ ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారన్నారు. పెంచిన పన్నులను రద్దు చేయాలని లేనిపక్షంలో ప్రజలను కలుపుకుని ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.