కొల్లేరు ప్రాంతంలో ఉప్పునీటి ప్రమాదాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 'ఏపీ కృష్ణా కొల్లేరు సాలినిటీ మిటిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్' పేరిట ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రత్యేకించి విజయవాడ ప్రాంతంలో భూగర్భజలాలు ఉప్పునీటి మయంగా మారుతున్న పరిస్థితిని నివారించేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
కంపెనీల చట్టం 2013 ప్రకారం ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మొత్తం రూ.2,952 కోట్ల వ్యయంతో వివిధ చోట్ల ప్రాజెక్టులకు రెగ్యులేటర్లను నిర్మించనున్నారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన 12 కిలోమీటర్లు, 62 కిలోమీటర్ల వద్ద 2 బ్యారేజీలను.. అలాగే ఉప్పుటేరుపై 2 క్రాస్ రెగ్యులేటర్లను నిర్మించాలని నిర్ణయించారు. పాదతడిక స్ట్రెయిట్ వద్ద క్రాస్ రెగ్యులేటర్ తో పాటు పెదలంక కాలువపై అవుట్ ఫాల్ స్లూయిస్ను నిర్మించాలని నిర్ణయించారు.