తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో కోడిపందేల స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. చిన్నకంజర్ల శివారులో కోడి పందేలు ఆడుతున్నారనే పక్కా సమాచారం మేరకు డీఎస్పీ భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు జరిపారు. ఘటనా స్థలంలో 70 మంది ఉండగా.. 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అక్కినేని సతీశ్, కృష్ణంరాజు, శ్రీనులు బృందంగా ఏర్పడి పందేలు ఆడుతున్నారని డీఎస్పీ తెలిపారు.
21 మందిని పట్టుకొని రూ.13 లక్షల నగదు, 26 వాహనాలు, 27 సెల్ ఫోన్లు, 30 కత్తులు, 30 కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. అయితే చింతమనేని ప్రభాకర్, కృష్ణంరాజులు పరారయ్యారని, అక్కినేని సతీశ్, బర్ల శ్రీనులు అదుపులో ఉన్నారని డీఎస్పీ తెలిపారు.