Kishanreddy on Agnipath Protest: అగ్నిపథ్ విషయంలో యువతను తప్పుదారి పట్టిస్తున్నారని.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాజధానిలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసంపై కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షాకు వివరించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో దేశభక్తి, జాతీయ భావన పెంచే ప్రయత్నమే అగ్నిపథ్ అని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో అల్లర్లు సమంజసం కాదు.. సంయమనం పాటించాలని కిషన్‌రెడ్డి తెలిపారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు.
‘అగ్నిపథ్’ తప్పనిసరి కాదు:‘‘ప్రపంచంలోని అనేక దేశాల్లో ‘అగ్నిపథ్’ వంటి పథకాలు ఏళ్లుగా అమల్లో ఉన్నాయి. స్వచ్ఛందంగా ఇష్టపడినవాళ్లే ఈ పథకంలో చేరవచ్చు.. ఇందులో బలవంతం లేదు. దేశ సేవ చేయాలన్న తపన ఉన్నవాళ్లే అగ్నిపథ్‌లో పాల్గొంటారు. ఇజ్రాయిల్‌లో 12 నెలలు, ఇరాన్‌లో 20 నెలలపాటు సైన్యంలో పనిచేసే సంప్రదాయం ఉంది. యూఏఈలోనూ ఇటువంటి పథకం ఆరేళ్ల నుంచి అమలు చేస్తున్నారు. భారత్‌లో ఈ పథకాన్ని తప్పనిసరి చేయట్లేదు. ‘అగ్నిపథ్’ వీరుడు బయటకు వచ్చాక 10 మందికి ఉపాధి కల్పించేలా తయారవుతారు. మోదీ ప్రధాని కాకముందు నుంచే దీనిపై చర్చలు జరుగుతున్నాయి.
'అగ్నిపథ్ విషయంలో యువతను తప్పుదారి పట్టిస్తున్నారు. సికింద్రాబాద్‌లో పథకం ప్రకారం విధ్వంసం సృష్టించారు. రైల్వే కోచ్‌లకు కూడా నిప్పుపెట్టారు... బోగీలన్నీ ధ్వంసమయ్యాయి. స్టేషన్ ప్రాంగణంలోని ప్రయాణికుల బైక్‌లు తగలబెట్టారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ప్రయాణికులు సామాన్లు కూడా వదిలిపెట్టి భయంతో పరిగెత్తే పరిస్థితి. రాష్ట్ర పోలీసులు చూస్తూ ఉండిపోయారు... బాధ్యత లేదా? ఇన్ని జరుగుతున్నా సకాలంలో పోలీసులు ఎందుకు రాలేదు. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.'- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి