ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కిడ్నీ రాకెట్​ గుట్టు రట్టు... ప్రధాన నిందితుడు శ్రీనివాస్ అరెస్ట్

మూత్ర పిండాల దందా నడిపిస్తోన్న వ్యక్తిని హైదరాబాద్ బంజరాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 406, 420 కింద కేసులు నమోదు చేసినట్లు జాయింట్ పోలీస్ కమిషనర్, వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు.

Kidney rocket conspiracy ... Main accused Srinivas arrested
Kidney rocket conspiracy ... Main accused Srinivas arrested

By

Published : Jul 18, 2020, 8:37 PM IST

కిడ్నీ రాకెట్​ గుట్టు రట్టు... ప్రధాన నిందితుడు శ్రీనివాస్ అరెస్ట్

అంతర్జాతీయ స్థాయిలో కిడ్నీ రాకెట్ నడిపిస్తున్న నిందితుడు శణ్ముఖ పవన్ శ్రీనివాస్... తెలంగాణలోని హైదరాబాద్ నగరం బంజారాహిల్స్ పోలీసులకు పట్టుబడ్డాడు. నగర వాసుల నుంచి డబ్బులు లాగుతూ విదేశాల్లో కిడ్నీ శస్త్ర చికిత్స చేయిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. శ్రీలంకతో పాటు టర్కీలో కిడ్నీ సర్జరీ పేరుతో మోసాలకు పాల్పడ్డాడు. నిందితుడు శ్రీనివాస్.... ఆన్​లైన్ ద్వారా డోనర్స్ వివరాలు సేకరించి కిడ్నీ అవసరం ఉన్న వారిని సంప్రదించి డబ్బులు దండుకుంటున్నాడు.

బయట దేశాల్లో సర్జరీ అంటూ...

మూత్ర పిండం అవసరం ఉన్న వారి పూర్తి వివరాలు శ్రీలంక, టర్కీ వైద్యులకు చేరవేస్తున్నాడు. నిందితుడు శ్రీనివాస్​కి అక్కడి వైద్యులే విమాన టికెట్ సమకూరుస్తుంటారు. శ్రీలంకలోని వెస్టర్న్, నావలోక, హేమాస్, ఆస్పత్రుల్లో సర్జరీ చేస్తామంటూ ఒక్కో బాధితుడి నుంచి 30 నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఒక్కో ఆపరేషన్​కు నిందితుడికి రూ.5 లక్షలు మిగులుతాయని జాయింట్ పోలీస్ కమిషనర్, వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు.

రూ.34 లక్షలతో ఉడాయింపు..

బిజ్జల భారతి అనే బాధితురాలు.. జూన్ 2019లో నిందితుడు శ్రీనివాస్​ను సంప్రదించింది. తన భర్తకు రెండు కిడ్నీలు కావాలని కోరారు. ఫలితంగా శ్రీనివాస్ ఆ దంపతుల నుంచి రూ. 34 లక్షలు డిమాండ్ చేశాడు. భార్య, భర్తలు ఇద్దరు అంగీకరించి మొదటి విడతగా రూ.14 లక్షల రూపాయలు చెల్లించారు. పాస్​పోర్ట్, విమాన టికెట్లు, తదితర ఖర్చుల నిమిత్తం భారతీ దంపతుల నుంచి మరికొంత డబ్బు తీసుకున్నాడు. బాధిత దంపతుల నుంచి మొత్తం 34 లక్షల రూపాయలు తీసుకుని ప్రయాణ ఏర్పాట్లేవీ చేయకుండా ఉడాయించాడని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు.

జూన్​ 2019లో ఫిర్యాదు...

బంజారాహిల్స్, కమలాపురి కాలనికి చెందిన బాధితురాలు భారతీ బంజరాహిల్స్ పోలీసులకు జూన్ 2019లో ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి ఆధారాలతో ప్రధాన నిందితుడు శ్రీనివాస్​ను అరెస్ట్ చేశారు.

గతంలోనూ కేసులే...

గతంలో నిందితుడు శ్రీనివాస్​తో పాటు ఈ కేసులో మరో నిందితుడు రామ్ ఆశిష్ కరణ్​పై ఏపీ విజయవాడలోనూ రెండు కేసులు, సీసీఎస్ హైదరాబాద్​లో ఒక కేసు నమోదయ్యాయని డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరించారు.

ఏవైనా అనుమానాలుంటే ఆశ్రయించండి..

నిందితుడు షణ్ముఖ పవన్ శ్రీనివాస్​పై ఐపీసీ సెక్షన్ 406, 420 కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. ప్రజలెవరూ ఇలాంటి ఏజెంట్లను నమ్మకూడదని డీసీపీ సూచించారు. అనుమానాలు ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

గవర్నర్​ వద్దకు ఆ 2 బిల్లులు.. తిరుగుతున్నాయి ఎన్నో మలుపులు

ABOUT THE AUTHOR

...view details