ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KIDNEY: కిడ్నీలపై 'సిలికా'టు.. తాగునీరు, గాలి ద్వారా వ్యాప్తి! - Telangana News

Kidney Failure Disease: మూత్రపిండాల వైఫల్య వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. పేదలు, ధనికులనే తేడా లేకుండా అన్ని వర్గాల వారూ కిడ్నీ దెబ్బకు కుదేలవుతున్నారు. బీపీ, షుగర్‌ తదితరాలు ఇప్పటివరకు దీనికి ప్రధాన కారకాలుగా గుర్తించగా, ఇప్పుడు ఆ జాబితాలో ప్రమాదకర ఖనిజం సిలికా చేరింది.

KIDNEY
KIDNEY

By

Published : Jun 19, 2022, 10:07 AM IST

Kidney Failure Disease: ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల వైఫల్య వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. పేదలు, ధనికులనే తేడా లేకుండా అన్ని వర్గాల వారూ కిడ్నీ దెబ్బకు కుదేలవుతున్నారు. బీపీ, షుగర్‌ తదితరాలు ఇప్పటివరకు దీనికి ప్రధాన కారకాలుగా గుర్తించగా, ఇప్పుడు ఆ జాబితాలో ప్రమాదకర ఖనిజం సిలికా చేరింది. ‘సిలికా’తో కలుషితమైన నీరు మూత్రపిండాలపై విషం చిమ్ముతోందని తాజా పరిశోధనలో తేటతెల్లమైంది. లోతైన బోరు నీటిని తాగడం, దాంతో పండించిన వరి, చెరకులను తినడం, గ్రానైట్‌ ధూళి కణాలను పీల్చడం వంటి పరిస్థితుల వల్ల శరీరంలోకి సిలికా చేరి.. మూత్రపిండాల ముప్పు అధికమవుతోందని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికా, మెక్సికో, స్వీడన్‌, బ్రిటన్‌, థాయిలాండ్‌, భారత్‌ తదితర దేశాల్లో సాగిన పరిశోధనలో మన దేశం నుంచి శ్రీరామచంద్ర మెడికల్‌ అండ్‌ రీసెర్చి సెంటర్‌ (తమిళనాడు), నిమ్స్‌ (హైదరాబాద్‌) భాగస్వాములయ్యాయి. నిమ్స్‌ నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్‌ తాడూరి గంగాధర్‌ ఇందులో పాలుపంచుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఆదిలాబాద్‌, సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, చీమకుర్తి, ఉద్దానం ప్రాంతాలు, ఒడిశా, గోవా, తమిళనాడు రాష్ట్రాల్లో పరిశోధన సాగింది. మూడేళ్లుగా ఎలుకలపై చేసిన ప్రయోగాలతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎలుకలకు సిలికాతో కూడిన నీటిని, సిలికా దుమ్ముతో నిండిన గాలిని అందించారు. దీంతో వాటి మూత్రపిండాలు చెడిపోయినట్లు గుర్తించారు. మనుషుల్లోనూ ఇదే దుష్ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధన పత్రం జూన్‌ 14న ప్రఖ్యాత వైద్యపత్రిక ‘అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఫిజియాలజీ’లో ప్రచురితమైంది.

తెలుగు రాష్ట్రాల్లో వ్యాధి విజృంభణ..

* తెలంగాణలో ఏటా కొత్తగా సుమారు 20 వేల మంది మూత్రపిండ వ్యాధుల బారిన పడుతుండడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. వీరిలో 5-6 వేల మందికి డయాలసిస్‌ అవసరమవుతోంది. రాష్ట్రంలో కిడ్నీ రోగుల కోసం ప్రభుత్వ పథకాల ద్వారా ఏటా రూ.250 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారు. గత ఎనిమిదేళ్లలో బాధితుల సంఖ్య సుమారు ఆరింతలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. వీరిలో దాదాపు 40 శాతం మంది 40 ఏళ్ల లోపు వారే. 50 ఏళ్ల లోపు వారు మరో 25 శాతం మంది ఉంటున్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో ఏటా దాదాపు 50 వేల మందికి కొత్తగా మూత్రపిండాల వ్యాధి సోకుతోంది. వీరిలో 10 వేల మందికి పైగా డయాలసిస్‌ రోగులుంటున్నారు. కిడ్నీ రోగుల్లో కాళ్లకు నీరు చేరడం, కళ్ల కింద ఉబ్బడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ కొత్తగా కనుగొన్న కారణాలతో వ్యాధిగ్రస్థులయ్యేవారిలో ఈ లక్షణాలేవీ తొలిదశలో కనిపించకపోవడం గమనార్హం.

ఖనిజంతో ప్రమాదం..

* అధ్యయన ప్రాంతాల్లోని బాధితుల్లో అత్యధికులు దీర్ఘకాలంగా భూగర్భ జలాలను తాగుతున్నారు. పంట పొలాలకూ వాడుతున్నారు. ఆ జలాల్లో ప్రమాదకరమైన ‘సిలికా’ వంటి ఖనిజాలున్నట్లు గుర్తించారు.

* చెరకు, వరి గడ్డిని కాల్చినప్పుడు వచ్చే పొగ, దుమ్ములో సిలికా అధికంగా ఉంటుంది. ఆ ధూళిని పీల్చడం మరో కారణం.

* గ్రానైట్‌ రాళ్ల పనుల్లో వెలువడే సిలికా రేణువుల వల్ల ఊపిరితిత్తులు, కిడ్నీలు దెబ్బతింటాయని తేలింది.

ఉపరితల జలాలే మేలు..

- ఆచార్య డాక్టర్‌ తాడూరి గంగాధర్‌, నెఫ్రాలజీ విభాగాధిపతి, నిమ్స్‌

సిలికా.. మూత్రపిండాలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని మా పరిశోధనలో వెల్లడైంది. లోతుగా బండలను చీల్చుకుంటూ బోర్లు వేసినప్పుడు ప్రమాదకరమైన ఖనిజాలు నీటిలో కలుస్తాయి. 300- 400- 600 మీటర్ల లోతు బోర్లలోని నీటిని వాడడం వల్ల ఖనిజ సాంద్రత పెరిగి కిడ్నీ జబ్బులొస్తున్నాయి. ఆ నీటిలోని సిలికా.. వరి ధాన్యం, చెరకు గడలపై పేరుకుపోతుంది. అందుకే తాగుకు, సాగుకు చెరువులు, కుంటల ద్వారా వచ్చే భూ ఉపరితల జలాలను వాడడమే శ్రేయస్కరం. తెలంగాణలో మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు, మిషన్‌ కాకతీయ ద్వారా సాగునీరు.. ఉపరితల జలవనరుల నుంచే అందిస్తున్నారు. దీనివల్ల సిలికా ప్రమాదం తగ్గుతుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details