ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనాను ఆరోగ్యశ్రీలో కలిపేందుకు పరిశీలిస్తాం: కేసీఆర్‌ - అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రసంగం

కరోనా నియంత్రణకు అహోరాత్రులు శ్రమించామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా సంక్షోభ సమయంలోనూ సంక్షేమం ఆపలేదని స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. ఉద్యోగులు, పింఛన్ల జీతాల్లోనూ కోతలు విధించి ప్రజలను ఆదుకున్నామని చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రజలకు భరోసా ఇచ్చారు.

కరోనాను ఆరోగ్యశ్రీలో కలిపేందుకు పరిశీలిస్తాం: కేసీఆర్‌
కరోనాను ఆరోగ్యశ్రీలో కలిపేందుకు పరిశీలిస్తాం: కేసీఆర్‌

By

Published : Sep 9, 2020, 7:16 PM IST

కరోనా... ప్రపంచం, దేశానికి వచ్చిన విపత్తని... కేవలం తెలంగాణలో మాత్రమే కరోనా రాలేదని అసెంబ్లీలో కరోనాపై చర్చలో ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ తెలిపారు. తాను ముందునుంచి చెబుతున్నట్లు ప్రజలు ఎవరికి వారే రక్షించుకోవాలన్నారు. ప్రజలను రక్షించేందుకు అవసరమైన సౌకర్యాలు, సేవలు ప్రభుత్వం అందిస్తోందని పేర్కొన్నారు. రాజకీయకంగా ఎవరు ఏం మాట్లాడినా నమ్మొద్దని సూచించారు.

రికవరీలో ముందున్నాం

కరోనాను ఆరోగ్యశ్రీలో కలిపేందుకు పరిశీలిస్తామని కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా మరణాల సంఖ్య జాతీయ స్థాయిలో కంటే తక్కువగా ఉందన్నారు. డబ్బుల విషయంలో గతిలేని స్థితిలో రాష్ట్రం లేదని స్పష్టం చేశారు. అన్‌లాక్‌ ప్రారంభమైన తర్వాత రికవరీలో ముందంజలో ఉన్నామని వివరించారు.

మరణాలు దాచేస్తారా

'రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన 108 మంచి పథకం. ఆ పథకం బాగుందనే కొనసాగిస్తున్నాం. మంచిని మంచి అని చెప్పేందుకు మాకు భేషజాలు లేవు. ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్యశ్రీ ఎన్నోరెట్లు పటిష్టంగా ఉంది. ఆరోగ్యశ్రీ కంటే గొప్పదని చెప్పుకొని భాజపా అభాపాసుపాలు కావొద్దు. ప్రజలు కోరితేనే హోం ఐసోలేషన్‌కు అనుమతి ఇచ్చాం. మరణాలు దాచేస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారు. మరణాలను ఎవరైనా దాచేస్తారా. కుటుంబసభ్యులు, బంధువులకు తెలియదా. మరణాలు దాచేస్తే దాగేవేనా.'

- కేసీఆర్, తెలంగాణ సీఎం

బురదజల్లే ప్రయత్నం

మద్యం దుకాణాలు కేవలం తెలంగాణలోనే తెరిచామా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోనూ మద్యం దుకాణాలు తెరవలేదా అని నిలదీశారు. ప్రతిపక్షం బురదజల్లే ప్రయత్నంలో భాగంగానే ఆరోపణలు చేస్తోందన్నారు. ప్రజలు కోరితేనే హోం ఐసోలేషన్‌కు అనుమతి ఇచ్చామన్నారు. దిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో సంప్రదించిన తర్వాతే హోం ఐసోలేషన్‌కు అనుమతి ఇచ్చామని కేసీఆర్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details