అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై రేపు మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. నీటిపారుదలశాఖ అధికారులతో ప్రగతిభవన్‌లో భేటీ అవుతారు. సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో చర్చిస్తారు. నీటిపారుదలశాఖ వివరాలు, కేంద్రానికి చెప్పాల్సిన అంశాలను తీసుకుని రావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజానిజాలను తేటతెల్లం చేయాలి..
నదీజలాలపై ఏపీ కావాలనే కెలికి కయ్యం పెట్టుకుంటోందని... ఏపీ వాదనలకు అపెక్స్ కౌన్సిల్ భేటీలో దీటుగా జవాబు చెప్పాలన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా కుండబద్ధలు కొట్టినట్లు నిజాలు చెప్పాలని అధికారులకు సీఎం సూచించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి, ఏడేళ్ల అలసత్వాన్ని తీవ్రంగా ఎండగట్టాలన్నారు. ప్రజల హక్కులను హరించేందుకు జరుగుతున్న యత్నాన్ని ప్రతిఘటించాలని చెప్పారు. నిజానిజాలను యావత్ దేశానికి తేటతెల్లం చేయాలన్నారు.