ఎగువ కృష్ణానదిలో ఆలమట్టి ప్రాజెక్టు భారీ విస్తరణకు కర్ణాటక శ్రీకారం చుట్టింది. బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పును కేంద్ర ప్రభుత్వం ఇంకా నోటిఫై చేయకముందే ఆలమట్టి నుంచి అదనంగా 130 టీఎంసీల నీటి వినియోగానికి ప్రణాళిక రూపొందించింది. 14.95 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే ఈ పథకానికి రూ.51,148 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఇటీవల కేంద్ర జలసంఘానికి పంపింది.
20 గ్రామాలతోపాటు బాగల్‌కోట్ పట్టణం కూడా పాక్షికంగా ముంపునకు గురవుతుందని వెల్లడించింది. ముంపునకు గురయ్యే 76 వేల ఎకరాల భూమితో పాటు పునరావాసానికి, భూసేకరణ చట్టం-2013 ప్రకారం కొందరికి ప్రత్యామ్నాయ భూమి ఇవ్వడానికి..ఇలా అన్నీ కలిపి లక్షా 34 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుందని, పునరావాసం కోసం రూ.20 వేల కోట్లకు పైగా వ్యయం చేయాల్సి ఉంటుందని డీపీఆర్‌లో నివేదించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్పినా..
ఆలమట్టి విస్తరణతో తమపై తీవ్రంగా ప్రభావం పడుతుందని బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ ఎదుట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాదించినా ట్రైబ్యునల్ అదనంగా 130 టీఎంసీల నీటిని కేటాయించడంతోపాటు ఆలమట్టి ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్ల ఎత్తుకు పెంచుకోవడానికి అనుమతించింది. దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ట్రైబ్యునల్ తీర్పును కేంద్రం గెజిట్‌లో ప్రచురించకుండా నిలుపుదల చేసింది. కేంద్రం దీనిని నోటిఫై చేసే వరకు బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పు అమలులోకి రానట్లే.
అయితే దీనికన్నా ముందే కర్ణాటక అదనంగా కేటాయించిన 130 టీఎంసీల నీటి వినియోగానికి ఎగువ కృష్ణా మూడవ దశ సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్ర జలసంఘానికి సమర్పించింది. దీని ప్రకారం ఆలమట్టి ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచుతారు. 14.95 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందిస్తారు. ఆలమట్టి నుంచి ముల్వాడ్, చిమ్మల్గి, కొప్పల్, హెర్కల్ ఎత్తిపోతల పథకాలను చేపట్టి 11 లక్షల ఎకరాలకు , నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి నారాయణపూర్ కుడి బ్రాంచి కాలువ విస్తరణ, ఇంది ఎత్తిపోతల విస్తరణ, రాంపూర్ ఎత్తిపోతల ఎత్తిపోతల విస్తరణ, మల్లబాద్ ఎత్తిపోతల, భీమా గట్టు పథకం విస్తరణ ద్వారా 3.95 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందిస్తారు. ఆలమట్టి ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం 105.46 టీఎంసీల నుంచి 205.98 టీఎంసీలకు పెరుగుతుంది. మొత్తం మూడు దశల కింద నీటి వినియోగం 173 టీఎంసీల నుంచి 303 టీఎంసీలకు పెరుగుతుంది.