విజయవాడలో గతంలో మంజూరు చేసిన సామాజిక భవనాలను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ.. కాపు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గంలో కాపు భవనాలను రద్దు చేసే హక్కు ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఎవరిచ్చారని ముఖ్యఅతిథిగా హాజరైన తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
వంగవీటి రంగా, దాసరి నారాయణరావు పేరుపై గత తెదేపా ప్రభుత్వ హయాంలో కాపు కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్క కమ్యూనిటీ భవనానికి రూ. 75 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించామన్నారు. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలో వచ్చాక.. తెదేపా ఇచ్చిన జీవో-191ని స్థానిక ఎమ్మెల్యే విష్ణు కక్షతో రద్దు చేయించారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా..ఈ ప్రభుత్వం కాపు భవనాల నిర్మాణాన్ని పట్టనట్లుగా వ్యవహరిస్తోందన్నారు.