వైకాపా పాలనపై కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. పార్టీ పరంగా, హిందువులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. విగ్రహాలు పగలగొడుతున్నారని.. మతిస్థిమితం లేని వారు అలా చేస్తున్నారని పోలీసులు చెప్పడం సరికాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయవాడ వెన్యూ కన్వెన్షన్ హాలులో కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో వివిధ పార్లమంట్ నియోజకవర్గ నాయకులతో ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 'ఇసుక విధానం అమోఘం అన్నారు. ఇప్పుడు వారి పార్టీ నేతలే దోచుకుంటున్నారు. మా పార్టీ నేతలు అడ్డుకుంటే... వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. రాజన్న పాలన ఇస్తామని రాక్షస పాలన చేస్తున్నారు.' అని కన్నా విమర్శించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ దాడులు చేస్తున్నట్టు అభిప్రాయపడ్డారు.
హైకోర్టు కర్నూలులో ఉండాలన్నదే మా స్టాండ్
రాజధాని నిర్మాణ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనన్న కన్నా.. ఆ నిర్ణయం ఎప్పుడో అయిపోయిందని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని నమ్మి 33 వేల ఎకరాలు ఇచ్చారని.. బాండ్లు కొన్నారని గుర్తు చేశారు. కేంద్రం గుర్తించి.. నిధులు విడుదల చేసిందని.. అహంకార పూర్వకంగా నిర్ణయాలు తీసుకుంటే భాజపా చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. హైకోర్టు కర్నూలులో ఉండాలన్నదే తన స్టాండు అని.. అవినీతి కోసం, స్వార్థం కోసమే రాజధాని మారుస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు.