Kanakamedala Ravindra kumar: జగన్ ముఖ్యమంత్రిగా ఉండటమే ఏపీ దౌర్భాగ్యమని.. తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండడం దౌర్భాగ్యమని వైకాపా ఎంపీలు అంటున్నారు. నిజమే జగన్ ప్రతిపక్ష నేతగా ఉండడమే రాష్ట్రానికి మంచిది’ అని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్రమోదీని కలిసినప్పుడు ముఖ్యమంత్రి ఏం అడిగారని తాము ప్రశ్నిస్తే.. వైకాపా ఎంపీలు తమను, తమ పార్టీ అధినేత చంద్రబాబును దూషించడమేమిటని ప్రశ్నించారు. తిట్టడమే వారి పనిగా మారిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాగ్ నివేదికనే తాము చెబుతున్నామని, అది తప్పయితే దానిపై వైకాపా ఎంపీలు పార్లమెంటులో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కాగ్ అవాస్తవాలు చెప్పిందని వైకాపా ఎంపీలు నిరూపించాలని సవాలు విసిరారు.
ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రితో ముఖ్యమంత్రి ఫలానా అంశాలు మాట్లాడారంటూ గతంలో ఇచ్చిన ప్రెస్‌నోట్ లోనే మళ్లీ విడుదల చేశారని ఎద్దేవా చేశారు. తమ రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నాయని, పథకాలకు నిధులు లేవని ఉభయసభల్లోనూ వైకాపా ఎంపీలు చెప్పారని.. దాన్నే తాము చెబితే దూషిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రాన్ని నిలదీసేందుకు గతంలో అందులో భాగస్వాములుగా ఉన్న తమ పార్టీ మంత్రులు పదవులకు రాజీనామా చేశారని, ఇప్పుడు వైకాపా నేతలు కేసుల భయంతో మోకరిల్లుతున్నారని ఆరోపించారు. రెండుసార్లు శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలిచిన రామ్మోహన్‌నాయుడి స్థాయి గురించి వైకాపా ఎంపీలు మాట్లాడుతున్నారని, ఎర్రన్నాయుడి కుటుంబ ప్రతిష్ఠ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని వివరించారు.