రాష్ట్రంలో జరిగే అరాచకాలు ఉన్మాది పాలనను తలపిస్తున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కళా వెంకట్రావు అరెస్టు ఘటనపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కళా వెంకట్రావు చేసిన తప్పేంటి? అని డీజీపీ గౌతం సవాంగ్‌ను ప్రశ్నించారు. రాముడి విగ్రహం ధ్వంసం చేసిన 5 రోజుల తర్వాత రామతీర్థం వెళ్లిన.. విజయసాయిరెడ్డిని ఏ చట్టం కింద రామతీర్థానికి అనుమతించారన్నారు. శాంతిభద్రతలు పరిరక్షించే విధానం ఇదేనా.. డీజీపీ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కళా వెంకట్రావుపై అక్రమ కేసులు నమోదు చేశారన్నారు.
చరిత్ర హీనులుగా మిగలొద్దు
"ఒక క్రైస్తవుడు.. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిందూ దేవాలయాలపై దాడులు జరగకుండా చూసే బాధ్యత లేదా" అని చంద్రబాబు ధ్వజమెత్తారు. కళా వెంకట్రావు, దేవినేని ఉమా ఘటనలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చామన్నారు. ప్రతి పోలీసుస్టేషన్ లో ఇదే చరిత్ర పునరావృతం అవుతుందని చంద్రబాబు విమర్శించారు. తెదేపా ప్రభుత్వంలో ప్రస్తుత డీజీపీ మంచిగానే పనిచేశారని.. పదవి కాపాడుకోవడం కోసం చరిత్ర హీనులుగా మిగలొద్దని హితవుపలికారు. కళా వెంకట్రావు పై పెట్టిన సెక్షన్లే తనపైనా పోలీసులు పెట్టారని.. వాటికి తాను స్పందించాల్సిన పనిలేదని తేల్చిచెప్పారు.
మీ ఆటలు సాగవు
'ఓటు బ‌్యాంకు రాజకీయాల కోసం కుట్ర జరుగుతోంది. ప్రవీణ్ చక్రవర్తి ఎక్కడున్నారో పోలీసులు చెప్పాలి. రాష్ట్రంలో బలవంతంగా మతమార్పిడులు జరుగుతున్నాయి. కళా వెంకట్రావును అర్ధరాత్రి అరెస్టు చేస్తారా? ఇష్టం వచ్చినట్లు చేద్దామంటే మీ ఆటలు సాగవు.' అని చంద్రబాబు హెచ్చరించారు.
ప్రశ్నిస్తే.. కేసులా?
నిన్న దేవినేని ఉమను అరెస్టు చేసి అనేక స్టేషన్లకు తిప్పారని చంద్రబాబు మండిపడ్డారు. ఇంటికి వచ్చి కొడతామన్న మంత్రులపై చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు. సీఎం, హోంమంత్రి, డీజీపీ ఒకే మతం వాళ్లయితే ఏమవుతుందన్నారు. ఆలయాలపై 145 దాడులు జరిగాయి.. ఏం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. దాడులు జరిగాయని చెప్పేవారిపై కేసులు పెడతారా? అని అడిగారు.