ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంటర్‌ ఫలితాల్లో.. సీఎం జగన్ జిల్లా లాస్ట్! - ఏపీ ఇంటర్ ఫలితాలు

Inter results: ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాల్లో.. కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. కడప జిల్లా చివరి స్థానంలో ఉంది. కడపలో మొదటి సంవత్సరం వారు 41% మంది మాత్రమే ఉత్తీర్ణులు కాగా.. రెండో ఏడాదిలో సగంమంది ఫెయిల్‌ అయ్యారు. సీఎం జగన్‌ సొంత జిల్లా, విద్యాశాఖ మంత్రి సొంత జిల్లాలకు.. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 13, 12 స్థానాలు దక్కాయి.

kadapa nd vizianagaram districts are in last place in inter ranks
ఇంటర్‌ ఫలితాల్లో అట్టడుగున కడప జిల్లా

By

Published : Jun 23, 2022, 6:39 AM IST

Inter results: ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. కడప జిల్లా అట్టడుగున నిలిచింది. కడపలో మొదటి సంవత్సరం వారు 41% మంది మాత్రమే ఉత్తీర్ణులు కాగా.. రెండో ఏడాదిలో సగంమంది ఫెయిల్‌ అయ్యారు. విజయనగరం జిల్లా రెండు సంవత్సరాల ఫలితాల్లోనూ అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచింది. సీఎం జగన్‌ సొంత జిల్లా, విద్యాశాఖ మంత్రి సొంత జిల్లాలకు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 13, 12 స్థానాలు దక్కాయి.

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో కడప జిల్లాలో బాలురు 34% శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 66% శాతం మంది ఫెయిల్‌ అయ్యారు. ఇక్కడ బాలికల్లోనూ ఉత్తీర్ణత బాగా తగ్గింది. 47% మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత 61% ఉండగా.. కడప, విజయనగరం జిల్లాల్లో 50% మందే గట్టెక్కారు. మొదటి సంవత్సరంలో రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత 54% ఉండగా.. విజయనగరం 42%, కడప 41%తో చివరి స్థానాల్లో నిలిచాయి.

ఐదేళ్లలో అత్యల్పం..ఐదేళ్ల తర్వాత ఇంటర్‌ మొదటి ఏడాది ఫలితాలు అతి తక్కువగా 54%గా నమోదయ్యాయి. కరోనా కారణంగా గతేడాది విద్యార్థులందర్నీ ఉత్తీర్ణులు చేశారు. 2020లో 59% ఉత్తీర్ణత రాగా.. ప్రస్తుతం మరో 5 శాతం తగ్గింది. కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు మినహా మిగతా అన్ని జిల్లాలు ఉత్తీర్ణతలో రాష్ట్ర సరాసరి కంటే దిగువనే ఉన్నాయి.

కర్నూలు, శ్రీకాకుళం, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో 50% మందికిపైగా విద్యార్థులు మొదటి ఏడాది పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత భారీగా తగ్గింది. చాలాచోట్ల 40 శాతంలోపే ఫలితాలు వచ్చాయి. మొదటి ఏడాది విద్యార్థులు గతేడాది పదో తరగతి పరీక్షలు రాయలేదు. కరోనా కారణంగా అందర్నీ ఉత్తీర్ణులు చేశారు. వీరు అంతకుముందు తొమ్మిదో తరగతి పరీక్షలు కూడా రాయలేదు.

రెండేళ్ల తర్వాత మొదటిసారి పరీక్షలు రాశారు. కరోనా సమయంలో అభ్యసనం కోల్పోవడం, ఆన్‌లైన్‌ తరగతులు సరిగా జరగకపోవడం, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఆన్‌లైన్‌ నిర్వహించడకపోవడం లాంటి కారణాలతో ఈ ఏడాది ఫలితాలు బాగా తగ్గాయి.

కోచింగ్‌ల కోసం రావడంతోనే..రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఇతర ప్రాంతాలకు చెందిన చాలామంది విద్యార్థులు కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఇంటర్మీడియట్‌తోపాటు జేఈఈ, నీట్‌, ఎంసెట్‌ కోచింగ్‌ల కోసం వస్తారు. వారంతా హాస్టళ్లలో ఉండి, ఇక్కడి నుంచే పరీక్షలకు హాజరవుతారు. వీరిలో ప్రతిభ కలిగిన విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. దీంతో ఈ జిల్లాల్లో ఉత్తీర్ణత శాతం ఎక్కువగా నమోదవుతోంది.

  • ద్వితీయ సంవత్సరంలో రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత 61% కంటే ఏడు జిల్లాలు వెనుకబడ్డాయి. ప్రస్తుతం రెండో సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు కరోనా కారణంగా మార్చిలో పరీక్షలు రాయలేదు. అందర్నీ పాస్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం ఉత్తీర్ణత మార్కులను మాత్రమే ఇచ్చారు. వాటిని పెంచుకోవాలంటే అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ రాసుకునేందుకు అవకాశం కల్పించారు. కొందరు విద్యార్థులు బెటర్మెంట్‌ రాయలేదు. దీంతో ఇలాంటి వారికి మార్కులు తక్కువగా వచ్చాయి.
  • ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను మొత్తంగా చూస్తే 57.54% మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. రెండు సంవత్సరాలకు కలిపి 8,69,059 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 5,00,040 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ లెక్కన రెండేళ్లల్లో కలిపి 42 శాతం మంది ఫెయిల్‌ అయ్యారు.

పేదింటి బిడ్డ.. చదువులో దిట్ట

చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపిస్తున్నాడీ విద్యార్థి. ఏలూరు జిల్లా దెందులూరుకు చెందిన దేవినేని శ్రీరామ్‌ ఏలూరులోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 991/1000 మార్కులు సాధించాడు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో తల్లి శ్రీలక్ష్మి ఏలూరులోని ఒక దుస్తుల దుకాణంలో పనిచేస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు కావాలనేది తన లక్ష్యమని శ్రీరామ్‌ చెప్పాడు.

తల్లిదండ్రుల బాటలో తనయ

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వి.సేవిత లాస్య సీనియర్‌ ఇంటర్‌ బైపీసీలో 990 మార్కులు సాధించింది. విజయవాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేసింది. నీట్‌లో మంచి ర్యాంకు సాధించి.. భవిష్యత్తులో వైద్యురాలు కావాలన్నదే తన లక్ష్యమని లాస్య పేర్కొంది. ఒంగోలులో ఆమె తండ్రి రామకృష్ణారెడ్డి జనరల్‌ సర్జన్‌, తల్లి సౌభాగ్యం గైనకాలజిస్టు. దాంతో వీరి బాటలోనే సేవిత నడుస్తోంది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details