Justice NV Ramana On Telugu: తెలుగు భాషా సంస్కృతులు క్రమంగా పడిపోతున్నాయని.. ప్రభుత్వాలు భాషా ఔన్నత్యానికి మద్దతు ఇవ్వడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఘంటశాల శత జయంతి సందర్భంగా సంగమం ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ... రవీంద్రభారతి ప్రాంగణంలోని ఘంటశాల విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గాన కోకిల పి.సుశీలను ఘంటశాల శతజయంతి పురస్కారంతో ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా వేదికపై 100 మంది చిన్నారులు ఆలపించిన ఘంటశాల పాటలు తనను బాల్యంలోకి తీసుకెళ్లాయన్నారు.
"ఘంటశాల పాటలు మన జీవితాలతో పెనవేసుకుపోయాయి. "తెలుగువీర లేవరా పాట" వింటే ఎంతో భావోద్వేగం కలుగుతుంది. అలాంటి గొప్ప గాయకుడున్న తెలుగు సినిమా రంగంలో తెలుగు భాష రోజురోజుకు దిగజారిపోతుంది. తొలినాళ్లలో సినిమా రంగం ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహారించేది. వ్యాపారాత్మకంగా కాకుండా సామాజిక స్పృహాతో తీసే చిత్రాలనే ప్రజల్లో చర్చించుకుంటారు. నటీనటులు తెలుగు ఉచ్చారణపై ప్రత్యేక శ్రద్ద చూపాలి."
-జస్టిస్ ఎన్వీ రమణ