సస్పెండయిన మున్సిఫ్ మెజిస్ట్రేట్ రామకృష్ణ, జస్టిస్ ఈశ్వరయ్యల మధ్య సంభాషణ కేసు తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వారి సంభాషణలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై కుట్రకు పథకం పన్నినట్లు స్పష్టమవుతున్నందున.. వాస్తవాల నిర్ధారణకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్‌తో విచారణ కమిటీని ఏర్పాటుచేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో తీర్పు చెప్పింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే కోరుతూ జస్టిస్ ఈశ్వరయ్య సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ అంశంపై సుదీర్ఘ వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 22న తీర్పును రిజర్వు చేసింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం తీర్పునివ్వాల్సి ఉంది. ఈ కేసులో తాము తాజాగా అప్లికేషన్ వేశామని సీనియర్ న్యాయవాది కపిల్‌సిబల్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
సస్పెండయిన మున్సిఫ్ మెజిస్ట్రేట్ రామకృష్ణను వేరొక కేసులో పోలీసులు అరెస్టు చేశారని వివరించారు. ఆ సమయంలో రామకృష్ణ ఫోన్‌ను సీజ్ చేసిన పోలీసులు అది పోయిందని చెబుతున్నారని ధర్మాసనానికి తెలిపారు. కేసు విచారణ దశలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో వాస్తవ సంభాషణ రికార్డుల్లోకి చేరకుండాపోయే ప్రమాదముందని తెలిపారు. జస్టిస్ ఈశ్వరయ్య తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ జోక్యం చేసుకుంటూ ఆ కేసుకు, దీనికి సంబంధం లేదని తెలిపారు. తీర్పును వెలువరించాలని కోరారు. ఏప్రిల్ 5న తాజా అప్లికేషన్‌ను విచారిస్తామంటూ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.