తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ..ఏపీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ప్రతినిధులు జనసేన నేత మనోహర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గెస్ట్ లెక్చరర్లకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టటం బాధాకరమని అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. గత ప్రభుత్వ హయాం నుంచి తమ జీతాల బకాయిలు పెండింగ్‌లో ఉండిపోయాయన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్నే..ఈ ప్రభుత్వమూ కొనసాగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ..వైకాపా ప్రభుత్వం తక్షణమే బకాయిపడ్డ జీతాలు ఇవ్వాలని.. లేనిపక్షంలో జనసేన పార్టీ తరఫున పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లుగా పని చేస్తున్న వారి సేవలను క్రమబద్ధీకరిస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ పట్టించుకోకపోవటం అన్యాయమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గెస్ట్ లెక్చరర్ల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నాయన్నారు.