కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం (సీపీఎస్) స్థానంలో గ్యారంటీడ్ పింఛన్ పథకాన్ని (జీపీఎస్) తీసుకువస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా జగన్ హామీ ఇచ్చారని, దాన్ని నిలబెట్టుకోవాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి డిమాండ్ పెరుగుతున్నందున సీపీఎస్, పాత పింఛన్ విధానానికి (ఓపీఎస్) మధ్యేమార్గంగా ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. జీపీఎస్ కింద ఉద్యోగుల పదవీవిరమణ నాటి మూలవేతనం (బేసిక్ పే)లో 33 శాతం పింఛను భద్రత కల్పిస్తామని చెప్పింది. డీఆర్, పీఆర్సీ వర్తించవనీ, ఉద్యోగికి పీఎఫ్ ఉండదని స్పష్టం చేసింది. ఉద్యోగి తన వాటాను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. దీన్ని పరిశీలించి సలహాలు, సూచనలు అందించాలని వెల్లడించింది. ఈ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యం కాదని, ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లుగా సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో టక్కర్ కమిటీ 50 శాతం పింఛను పథకాన్ని ప్రతిపాదించినా తిరస్కరించామని గుర్తు చేశారు. అంతకుముందు కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం (సీపీఎస్)పై ఉద్యోగ సంఘాలతో చర్చలకు మరో కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
సచివాలయంలో సోమవారం సీపీఎస్‌పై నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్‌శర్మతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జీపీఎస్ గురించి ప్రభుత్వ ప్రతినిధులు వివరించారు. పింఛను సంస్కరణల సవాళ్లు, పాత పింఛను పథకం అమలులో ఆర్థిక సుస్థిరత పరిశీలన, నూతనంగా ప్రతిపాదిస్తున్న ఏపీ హామీ పింఛన్ పథకం (జీపీఎస్) వివరాలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
పాత పింఛను పథకం సాధ్యం కాదు: బుగ్గన
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్తు తరాల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజల సంక్షేమం దృష్ట్యా పాత పింఛను పథకం అమలు దుస్సాధ్యమైన అంశంగా పరిణమించిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ‘పాత పింఛను విధానం అమలు దేశవ్యాప్తంగా పెద్ద సవాలుగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సాధ్యమైనంత మేర లబ్ధి చేకూర్చేలా రాష్ట్రంలో హామీ పింఛను పథకాన్ని (జీపీఎస్) అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ ప్రతిపాదనపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పూర్తిస్థాయిలో పరిశీలించి, సూచనలు, సలహాలు ఇవ్వాలి. తద్వారా ఉద్యోగులకు సాధ్యమైనంత మేలు చేసేలా ఈ పథకాన్ని రూపొందించేందుకు చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.
ఉద్యోగులకు భద్రత కల్పించేందుకే..: సజ్జల
పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు సాధ్యమైనంత భద్రత కల్పించేలా పింఛను పథకాన్ని రూపొందించి, అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. పాత పింఛను పథకం, సీపీఎస్ రెండింటినీ సమన్వయపరుస్తూ మధ్యేమార్గంగా రాష్ట్రంలో జీపీఎస్ అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల భద్రత దృష్ట్యా మంచి పింఛను పథకాన్ని రూపొందించేందుకు సలహాలు, సూచనలు అందించాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులను కోరారు. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు.
ఎలాగైనా జీపీఎస్ పెట్టాలని చూస్తోంది
సీపీఎస్‌కు బదులు జీపీఎస్‌ను ప్రతిపాదిస్తూ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బుక్‌లెట్ ఇవ్వాలని కోరాం. పాత పెన్షన్ విధానమే కావాలని మేం కోరుతున్నాం. జీపీఎస్‌పై అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పాం. ఉద్యోగ, ఉపాధ్యాయులతో చర్చించాలని కోరాం. సీపీఎస్, జీపీఎస్‌ల మధ్య తేడా ఏమిటో ప్రభుత్వం చెప్పలేదు. కానీ ఏదో ఒకటి చేసి జీపీఎస్ పెట్టాలని చూస్తోంది. ఇది ఆమోదయోగ్యం కాదని అన్ని సంఘాలు పేర్కొన్నాయి. ఈ పథకం బాగుందని కేంద్ర అధికారులు చెప్పారని రాష్ట్ర అధికారులు అంటున్నారు. - బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస ఛైర్మన్
సీపీఎస్ రద్దు చేయాల్సిందే
సీపీఎస్‌పై ప్రభుత్వం మూడేళ్ల తర్వాత తొలి సమావేశం ఏర్పాటు చేసింది. జీపీఎస్ ప్రతిపాదనను ఆమోదించబోమని స్పష్టం చేశాం. పాత పింఛను విధానంలో ఉద్యోగి రిటైరయ్యాక 50% పింఛన్ భద్రతను ఎలా పొందుతారో.. అందుకు అనుగుణంగా రాష్ట్ర నిధి ఏర్పాటు చేసి పింఛను రూపంలో చెల్లిస్తామని గత ప్రభుత్వ హయాంలో టక్కర్ కమిటీ చెప్పింది. దాన్ని అప్పుడే తోసిపుచ్చాం. సీపీఎస్ రద్దు చేస్తామనే ముఖ్యమంత్రి హామీ మేరకు నిర్ణయం ఉంటుందని వచ్చాం. కేంద్రం 2019లో ఇచ్చిన గెజిట్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను 14 శాతానికి పెంచలేదు. సీపీఎస్ ఉద్యోగి చనిపోతే.. అతని వాటా 50% వెనక్కి ఇవ్వాలని ఇవ్వాలని కేంద్రం 178 గెజిట్ ద్వారా చెప్పినా అందుకు అనుగుణంగా రాష్ట్రం ఉత్తర్వులివ్వలేదు. సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిల కింద రావాల్సిన 1,800 కోట్లలో రూపాయి ఇవ్వలేదు. 10% ప్రభుత్వ వాటా కూడా ఖాతాల్లో సరిగా పడటం లేదు. - బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్