ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

JAWAD CYCLONE EFFECT IN AP: తీవ్ర తుపానుగా జవాద్... రేపు తీరం దాటే అవకాశం - Jawad cyclone latest news

Jawad cyclone effect in Andhra pradesh : జవాద్‌ తుపాను మరింత బలపడి తీవ్రతుపానుగా మారింది. ఇవాళ ఉదయానికి ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చి.. అక్కడి నుంచి ఉత్తర దిశగా కదులుతూ రేపు మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు.

తీవ్ర తుపానుగా జవాద్
తీవ్ర తుపానుగా జవాద్

By

Published : Dec 4, 2021, 4:12 AM IST

Updated : Dec 4, 2021, 7:27 AM IST

తీవ్ర తుపానుగా జవాద్

Jawad cyclone effect in Andhra pradesh : జవాద్‌ తుపాను.. మరింత బలపడి తీవ్రతుపానుగా మారింది. శనివారం ఉదయానికి ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చి అక్కడి నుంచి ఉత్తర దిశగా కదులుతూ 5వ తేదీ మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దీని ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతోపాటు ఒడిశాలోని గంజాం, గజపతి, పూరీ, జగత్‌సింగ్‌పుర్‌ జిల్లాల్లో అధికారులు శనివారానికి రెడ్‌ ఎలర్ట్‌ జారీచేశారు. ప్రస్తుతం ఈ తుపాను విశాఖపట్నం తీరానికి దక్షిణంగా 250 కిలోమీటర్లు, పారాదీప్​కు 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని.. గంటకు 6 కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదులుతున్నట్లు భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. రేపు మధ్యాహ్నం తర్వాత క్రమంగా బలహీనపడి.. బంగాల్​ తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని ప్రకటించింది. రేపు రాత్రికి తుపాను వాయుగుండంగా మారే అవకాశం ఉంది.

తీరం దాటే సమయంలో భారీ గాలులు

heavy winds: జవాద్‌ తుపాను ఒడిశాలోని పూరీ జిల్లాలో ఆదివారం తీరం దాటి, తర్వాత బంగాళాఖాతం వైపు వెళ్తుందని ఒడిశా ప్రత్యేక సహాయ కమిషనర్‌ పీకే జెనా తెలిపారు. తీరం దాటే సమయంలో 90-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. అయితే, దిశ మార్చుకుని ఒడిశా మీదుగా వెళ్తూ తీరం దాటకపోవచ్చనీ ఆయన చెప్పారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే తీరం వెంబడి గాలుల వేగం పెరిగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. శనివారం ఉదయానికి గంటకు 80-100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. తుపాను కారణంగా 95కు పైగా రైళ్లు రద్దయ్యాయి.

ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం...

Jawad cyclone effect in Andhra pradesh : సహాయ కార్యకలాపాల కోసం జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) అప్రమత్తమైంది. 64 సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డీజీ అతుల్‌కుమార్‌ తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు 46 బృందాలను పంపామని, మరో 18 బృందాలను సిద్ధంగా ఉంచామని చెప్పారు.

అత్యంత భారీ వర్షాలు...

విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్‌ సునంద విలేకర్లతో మాట్లాడుతూ తీవ్ర వాయుగుండం శుక్రవారం రాత్రి తుపానుగా బలపడిందన్నారు. పశ్చిమ వాయవ్యదిశగా ప్రయాణిస్తున్న తుపాను ఉత్తరకోస్తా జిల్లాలకు దగ్గరగా రావొచ్చన్నారు. తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించొచ్చని తెలిపారు. ఫలితంగా శనివారం కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండుచోట్ల అత్యంత భారీవర్షాలు పడతాయన్నారు. తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి చలిగాలుల తీవ్రత పెరిగి, వర్షం కురిసింది. పాఠశాలలకు అయిదో తేదీ వరకు సెలవులు ప్రకటించారు. ప్రజలను తరలించేందుకు 21 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. అత్యవసర సేవల నిమిత్తం నౌకాదళం, కోస్టుగార్డు సేవలతో పాటు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. రుషికొండ బీచ్‌ వద్ద సముద్రం శుక్రవారం 200 అడుగులు వెనక్కి మళ్లింది. దీంతో ఇసుక తిన్నెలు, రాళ్లు బయటపడ్డాయి. తుపాను కారణంగా విశాఖ మన్యంలోని అన్ని పర్యాటక కేంద్రాలనూ ఐదో తేదీ వరకు మూసేయాలని పాడేరు ఐటీడీఏ పీఓ గోపాలకృష్ణ ఆదేశించారు.

ప్రత్యేకాధికారుల నియామకం...

Jawad cyclone effect in Andhra pradesh : శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తుపాను ప్రభావం ప్రారంభమైంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళానికి అరుణ్‌కుమార్‌, విజయనగరానికి కాంతిలాల్‌ దండేను ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వం నియమించింది. కాంతిలాల్‌ దండే, విజయనగరం కలెక్టర్‌ సూర్యకుమారి జిల్లాలోని అధికారులకు సూచనలు చేశారు. రెండు జిల్లాల్లోని తీరప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. శుక్రవారం సాయంత్రం నుంచే ప్రభావిత ప్రాంతాల ప్రజలను అక్కడకు తరలిస్తున్నారు. తుపాను సన్నద్ధతపై ప్రత్యేకాధికారి అరుణ్‌కుమార్‌, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ముఖ్యమంత్రి సమీక్ష...

జవాద్ తుపాను ప్రభావం చూపే ప్రాంతాల్లోని యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉండాలని మఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎక్కడా ప్రాణనష్టం జరగడానికి వీల్లేదని, ఈ మేరకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. లోతట్టు ప్రాంతాలవారిని తరలించి అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. భారీ వర్షాల దృష్ట్యా చెరువులు, జలాశయాలు తెగకుండా ఎప్పటికప్పుడు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుపాను పరిస్థితులపై ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

అప్రమత్తంగా ఉండండి...

Jawad cyclone effect in Andhra pradesh : ముందుజాగ్రత్త చర్యలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. తుపాన్‌ ప్రభావిత జిల్లాలకు 10 కోట్ల చొప్పున నిధులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో అవసరమైన ఎన్డీఆర్​ఎఫ్, ఎస్​డీఆర్​ఎఫ్ బృందాలు ఉండాలని, ఆ మేరకు మరోసారి అన్ని చోట్లా పరిస్థితులు సమీక్షించాలని నిర్దేశించారు. అవసరమైతే ఇంకా అదనపు బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. పూర్తి అప్రమత్తంగా ఉన్నామని దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్న సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. ఇప్పటికే 11 ఎన్డీఆర్ఎఫ్, 6 కోస్ట్‌గార్డ్‌, 10 మెరైన్‌ పోలీస్‌, 5 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, 18 ఫైర్‌ సర్వీస్‌ బృందాలను ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోహరించామని తెలిపారు. ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం పూరీ వద్ద తుపాను తీరం దాటే అవకాశం ఉందని దీని వల్ల రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సీఎంకు తెలిపారు.

ఇవీచదవండి.

Last Updated : Dec 4, 2021, 7:27 AM IST

ABOUT THE AUTHOR

...view details