విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమహేంద్రవరం, కాకినాడ, తిరుపతి, కర్నూలు రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలు. రోజూ ఈ నగరాల్లో ఉండే గజిబిజి తక్కువేమీ కాదు. పక్క వాళ్లతో మాట్లాడాలంటే అరవాల్సిన పరిస్థితి. కానీ 'జనతా కర్ఫ్యూ'తో ఈ నగరాలు చాలా ప్రశాంతంగా దర్శనమిచ్చాయి. రోజు వాహనాల చప్పుళ్లతో నిద్రలేచే.. మహానగరాల వాసులు ఇవాళ పక్షుల కిలకిలరావాలతో నిద్రలేచారు.
మహానగరాల్లో పక్షుల కిలకిల రావాలు విన్నారా..?
ఉదయాన్నే తన మిత్రుడు రమేశ్‌కు ఫోన్ చేశాడు విజయవాడలో ఉంటున్న కిరణ్. ఓవైపు బాధ ఉన్నా మరోవైపు చిన్న ఆనందం. ఎప్పుడూ చూడని విజయవాడను చూశానంటూ... అవతలి వైపు నుంచి మాట. నగరానికి వచ్చి 20 ఏళ్లవుతున్నా ఇలాంటి పరస్థితి ఎన్నడూ చూడలేదని చర్చించుకుంటున్నారు. ఇంతలోనే రమేశ్ ఫోన్లో నుంచి పక్షుల కిలకిల రావాలు వినిపించాయి. ఆహా... చాలా రోజుల తరువాత విజయవాడ మహానగరంలో ఇంత స్పష్టంగా పక్షుల అరుపులు వింటున్నాను అని చెప్పాడు మిత్రుడికి. ఇదంతా జనతా కర్ఫ్యూ పుణ్యమే ఫోన్ పెట్టేశాడు. నిజమే కదా... ఎప్పుడూ రణగొణ ధ్వనులతో ఉండే మహానగరంలో ఇది అరుదే కదా.
నగరాల్లో నివసించే జనాల చెవులు శబ్దకాలుష్యానికి దద్దరిలిపోయేవి. ఇవాళ్టి జనతా కర్ఫ్యూతో రోడ్లపై వాహనాలు లేవు. పరుగులు పెట్టే ప్రజలు కనిపించలేదు. ఫలితంగా మహానగరాలన్నీ పరిశుభ్రంగా దర్శనమిచ్చాయి. అత్యవసర సేవలు అందించే వాళ్లు తప్ప.. ఎవరూ రోడ్లపైకి రాలేదు. రోజూ కర్ఫ్యూ విధించకున్నా... పరిశుభ్రతను పాటించి మహా నగారాలను కాపాడుకుంటే 'జనతా కర్ఫ్యూ'లు మళ్లీ పెట్టాల్సిన పరిస్థితి రాదేమో. ఆలోచించి ఆచరించాల్సింది మనమే. మహానగరాలను కాపాడుకుని ఆరోగ్యంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిది. నగరాల్లో ప్రతిరోజూ పక్షుల కిలకిల రావాలు వినిపించేలా తయారు చేసుకోవాల్సిన అవసరం మనదే.
ఇదీ చదవండి: జనతా కర్ఫ్యూకి మద్దతుగా సీఎం జగన్ చప్పట్లు