అయోధ్యలో రామమందిరం నిర్మించేందుకు దొంగలైనా విరాళమివ్వవచ్చు కానీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అనర్హులని జనసేన నేత పోతిన మహేష్ విమర్శించారు. రామతీర్థంలో రాముడి విగ్రహం శిరచ్ఛేదనంతో పాటు 140 దేవాలయాలపై జరిగిన దాడులకు పాప పరిహారంగా ఆయన విరాళం ఇచ్చారన్నారు.
లీజు, లైసెన్సుదారులకు మేలు చేయమని దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేస్తే.. ఆ ముసుగులో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్న ఆలయ ఈవో సురేష్ బాబును మంత్రి ప్రోత్సహించడం దుర్మార్గమన్నారు. ఫొటో ల్యామినేషన్, కాలమానిని, అన్నదానం, లడ్డూ కాంట్రాక్ట్దారుల కాలాన్ని పొడిగిస్తూ.. ఆలయ ఆదాయానికి గండి కొట్టాలని పాలక మండలి నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. వారితో వెల్లంపల్లి కుమ్మక్కైనట్లు తెలుస్తోందని ఆరోపించారు. ఈ నాలుగు కాంట్రాక్ట్‌లకు టెండర్లు పిలవకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.