దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కి కరోనా సోకడం నిజమా.. అబద్ధమా అని జనసేన అధికార ప్రతినిథి పోతిన వెంకట మహేశ్ ప్రశ్నించారు. అమ్మవారి గుడిలో 3 వెండి సింహాల మాయం ఘటనను పక్కదారి పట్టించడానికి కరోనా పాజిటివ్ డ్రామా ఆడారా అని ఆయన నిలదీశారు.
కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక కనీసం వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలనే నిబంధన ఉందన్నారు. అయినా మంత్రి స్కూలు పిల్లలకు కిట్స్ పంపిణీ చేసే విద్యా కానుక కార్యక్రమంలో పాల్గొన్నారని విమర్శించారు. మంత్రికి కరోనా పాజిటివ్ ఉన్నట్లయితే మరి చిన్నపిల్లలకి ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని మహేష్ నిలదీశారు. పాఠశాల పిల్లలకు మంత్రి వెల్లంపల్లి విద్యాకానుక కాదు.. కరోనా కానుక ఇస్తారేమోనని టీచర్లు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. మంత్రి సీఎం జగన్‌కు కూడా దగ్గరగా ఉన్నారని.. ముఖ్యమంత్రి కరోనా పరీక్ష చేయించుకోవాలని మహేశ్ అన్నారు.