ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Nadendla Manohar: ప్రభుత్వానిది ఆదాయంలో ప్రగతా? అప్పుల్లో ప్రగతా?

By

Published : Oct 8, 2022, 5:24 PM IST

Nadendla Manohar: ప్రభుత్వానిది ఆదాయంలో ప్రగతా? అప్పుల్లో ప్రగతా? అని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ అన్నారు. రాష్ట్ర సొంత రాబడి 36 శాతమేనని 64 శాతం అప్పులు, కేంద్ర గ్రాంట్లేనని అన్నారు. ఏడాదిలో చేయాల్సిన అప్పు 5 నెలల్లో చేయడం ఆర్థికాభివృద్ధా? అని నిలదీశారు. జీఎస్‌టీ ఆదాయం పెరిగితే మౌలిక వసతులు ఎందుకు కల్పించరని ప్రశ్నించారు.

Nadendla Manohar
జనసేన

Nadendla Manohar: రాష్ట్రంలో జీఎస్టీ, ఇతర పన్నుల ద్వారా వచ్చే ఆదాయం జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు ఎక్కువగా ఉంటే, ఆ పన్నులు చెల్లించిన వారి అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు. జీఎస్టీ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలలతో పోలిస్తే,ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ.6 వేల కోట్లు ఎక్కువగా వచ్చిందని ఆయన అన్నారు. ఎంతోమంది తమ రక్తాన్ని చెమటగా మార్చి పన్నులు చెల్లిస్తే వారికి కనీస మౌలిక వసతుల కల్పనను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.

రాష్ట్రంలోని పారిశ్రామిక వ్యతిరేక విధానాల మూలంగా కొత్తగా పెట్టుబడులు కూడా రావడంలేదని... పెట్టుబడులు పెట్టాలని వచ్చే పారిశ్రామికవేత్తలు సైతం పాలక పక్ష వైఖరితో వెనక్కి వెళ్లిపోతున్నారని నాదెండ్ల ఆరోపించారు. ఈ మూడేళ్ల పాలన కాలంలో ఎన్ని కొత్త పరిశ్రమలు, ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయో చెప్పగలరా? అని నిలదీశారు. ఇందుకు సమాధానం లేకపోగా రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి అద్భుతంగా ఉందని ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. కాగ్ లెక్కల ప్రకారం చూసినా.. గణాంకాలు పరిశీలించినా ఈ రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి- ఆదాయంలో కాదు... అప్పుల్లోనే ఉందని అర్థమవుతోందన్నారు.

తొలి 5 నెలల్లో రూ.1,03,975 కోట్లు రాబడి సమకూరినట్లు గణాంకాలు చెబుతున్నాయని నాదెండ్ల మనోహర్​ తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా సమకూర్చుకున్న ఆదాయం రూ.36,902 కోట్లు మాత్రమేనని... అంటే మొత్తం సమకూరిన రాబడిలో ఇది 36 శాతం మాత్రమేనన్నారు. అప్పులు రూ.44,593 కోట్లు కాగా, కేంద్రం గ్రాంట్లు, పన్నుల వాటా రూ.8,290 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూ.14,190 కోట్లని చెప్పారు. అంటే అప్పులు, గ్రాంట్లు ద్వారా వచ్చింది 64 శాతమేనని గణాకాంలతో సహా ధ్వజమెత్తారు. ఇక ఇందులో ఆర్థికాభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

బడ్జెట్ అంచనాల ప్రకారం ఆర్థిక సంవత్సరం మొత్తంలో చేయాల్సిన అప్పు మొదటి అయిదు నెలల్లోనే చేశారని.. అంటే వైకాపా ప్రభుత్వానికి అప్పులు చేయడంలో కూడా ఒక విధానంగానీ, బడ్జెట్ అంచనాలు పట్టించుకోవడంగానీ లేదు అని అర్థమవుతోందని నాదెండ్ల విమర్శించారు. ప్రభుత్వ సొంత ఆదాయ మార్గాలు పెంచుకోకుండా అప్పుల మీద బండి లాగించాలని చూడటం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల్లో సొంత ఆదాయ మార్గాలు పెంచుకొంటున్నారని... అందుకనుగుణంగా పారిశ్రామిక, ఉపాధి అవకాశాల మెరుగుదలకు కావల్సిన విధానాలు అవలంభిస్తున్నారని... కానీ ఏపీలో మాత్రం కనీస అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని ఆరోపించారు. వైకాపాకు చిత్తశుద్ధి ఉంటే మూడేళ్లల్లో రాష్ట్ర ఆదాయాలు, అప్పులు, పెట్టుబడి, వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మనోహర్‌ డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details