అహంభావానికి, ఆత్మగౌరవానికి జరిగిన పోరాటంలో చివరికి ఆత్మ గౌరవమే గెలుస్తుందని.. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. "భీమ్లా నాయక్" సినిమా విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్.. సినిమా థియేటర్ల వద్ద కర్ఫ్యూ వాతావరణం సృష్టించారని విరుచుకుపడ్డారు. థియేటర్ల వద్ద జరిగిన సంఘటనలు చూసి అందరూ ఆశ్చర్యపోయారన్నారు. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తామన్న ముఖ్యమంత్రి.. పవన్ కల్యాణ్ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని ధ్వజమెత్తారు.
ప్రజాసమస్యలు తీరుస్తారని నమ్మి అధికారమిస్తే.. జగన్ ఇలాంటి పాలన అందిస్తారని ఎవరూ ఊహించి ఉండబోరని వ్యాఖ్యానించారు. ప్రజలు, రైతు సమస్యలను పరిష్కరించాల్సిన రెవెన్యూ సిబ్బంది.. వేకువ జామునే సినిమా థియేటర్ల దగ్గరకు వెళ్లి హడావుడి చేశారన్నారు. సంకుచిత మనస్తత్వం, నియంతలా వ్యవహరిస్తూ.. తన ఆలోచన మేరకే ప్రతి ఒక్కరు పనిచేయాలనే భావనతో ఉన్న ముఖ్యమంత్రి జగన్ను పక్కన పెట్టే సమయం ఆసన్నమైందని అన్నారు. ఆత్మగౌరవంతో ఉన్న వారంతా వైకాపా నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు.