బెజవాడ దుర్గమ్మ ఆలయంలో పచారీ సరుకుల కాంట్రాక్టర్ పై అధికారులకు అంత ప్రేమ ఎందుకని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ప్రశ్నించారు. అమ్మవారి నివేదనకు నాసిరకం కూడా కాదు.. అంతకన్నా దారుణమైన సరుకులు సరఫరా చేయడం వాస్తవం కాదా? అని నిలదీశారు. దుర్గగుడి అధికారులు స్టోర్ రూమ్ లోని పచారీ సరుకులను కనీసం తనిఖీ చేయరా? అని మండిపడ్డారు. భక్తుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని, బ్లాక్ లిస్టులో పెట్టి డబ్బు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇంద్రకీలాద్రి అమ్మవారికి.. ఆ సరుకులతో నైవేద్యం : జనసేన - potina mahesh
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో పచారీ సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్ పై జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్నారని, అయినా.. అధికారులు, ప్రజాప్రతినిధులు కళ్లు మూసుకున్నారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ మండి పడ్డారు.
శాంపిల్ డబ్బాల్లో నాణ్యమైన సరుకు చూపించి.. ఆ తర్వాత మాత్రం నాసిరకం కన్నా దిగువ నాలుగో రకం సరుకులు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతుంటే.. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ ఈవో, పాలకమండలి, ఎండోమెంట్ కమిషనర్, విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోకపోతే ఉగాది తర్వాత అమ్మవారి ఆలయం దగ్గర పెద్ద ఎత్తున భక్తులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: Yadadri Temple Reopening: యాదాద్రీశుడి ఘనచరిత్ర.. కనులముందు కొలువయ్యే తరుణం